ఏపీలో ఎన్నికలకు సంబంధించి వైసీపీ దూకుడు మీదుంది. అభ్యర్థుల ప్రకటన సమయంలోనూ అందరికంటే ముందు 175 అసెంబ్లీ స్థానాలు, 24 ఎంపీ సీట్లకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అలాగే మ్యానిఫెస్టో విషయంలోనూ అందరికంటే ముందే నిలిచింది. నవరత్నాలు ప్లస్ పేరుతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో 2024ను రిలీజ్ చేసింది. పాత పథకాలను కొనసాగిస్తూనే.. కొన్ని పథకాల్లో అందించే సాయాన్ని పెంచారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అయితే వైసీపీ మ్యానిఫెస్టోకు ధీటుగా టీడీపీ కూటమి మ్యానిఫెస్టో తయారీలో పడింది. ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానిపై హామీలు ఇస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ కూటమి ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారైంది.
ఏప్రిల్ 30వ తేదీన టీడీపీ కూటమి మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజవర్గంలోని ఏలేశ్వరంలో నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని వెల్లడించారు. తమ మేనిఫెస్టో చూస్తే ప్రజల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఓటు వేయాలని లేకపోతే ప్రజలకే నష్టం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ సూపర్ సిక్స్ అంటూ ఆరు హామీలను ప్రచారం చేస్తోంది. వీటి కింద ఆరు ప్రధానమైన హామీలను చంద్రబాబు ప్రకటించారు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి కల్పించలేకపోతే ప్రతి నెలా 3 వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15 వేలు అందిస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ప్రతి రైతుకు ఏటా 20 వేల రూపాయల ఆర్థిక సాయం, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా ప్రతి మహిళకు తాము అధికారంలోకి వస్తే నెలకు 1500 రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు.
టీడీపీ సూపర్ సిక్స్‌తో పాటుగా జనసేన, బీజేపీ పార్టీలు కూడా మ్యానిఫెస్టో మీద అభిప్రాయ సేకరణ జరిపి ఎన్నికల ప్రణాళిక తయారుచేశాయి. వీటన్నింటినీ కలిపి ఎన్డీయే కూటమి ఉమ్మడి మేనిఫెస్టో కింద ప్రకటించే అవకాశం ఉంది. తొలి నుంచి ప్రచారం చేస్తున్న విధంగా టీడీపీ సూపర్ సిక్స్ హామీలు ఇందులో ప్రధానంగా ఉండే అవకాశం ఉంది.