రాష్ట్రంలో ముస్లిం సోదరులకు న్యాయం చేసింది గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ నేత చంద్రబాబే అని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. మసీదుల అభివృద్ధికి షాదీఖానాలకు నిధులు కేటాయించింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. పవిత్ర రంజాన్‌మాసంలో సోదరుల కుటుంబాలకు రంజాన్ తోపాను అందించిందన్నారు. రాజమహేంద్రవరంలో మసీదులు, షాదీఖానాలు అభివృద్ధి తాము కృషి చేశామన్నారు. రెహ్మత్‌నగర్‌లో షాధీఖానా నిర్మాణానికి రూ.67,37, 453, నెహ్రునగర్ ఈద్గాకు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.20,32,549, మెయిన్ రోడ్డులో ముస్లింల బరియల్ గ్రౌండ్ అభివృద్ధికి రూ.15లక్షలు, జైలువార్డర్స్‌వద్ద ఉన్న ఆయేషా షాధీఖానా అభివృద్ధి కోసం రూ.25లక్షలు, అప్సరా థియేటర్ వెనుక ఉన్న హజరత్ వల్లీ జల్ జలీహ్ షాదీఖానా అభివృద్ధి కోసం రూ.25లక్షలు, దానవాయిపేట మదీనా షాదీఖానా అభివృద్ధి కోసం రూ.20లక్షలు, అదేప్రాంతంలో నూతనంగా షాదీఖానా నిర్మాణంకోసం రూ.50లక్షలు నిధులు కలిపి మొత్తం రూ.2,22,702 నిధులు మంజూరు చేయించానన్నారు. టీడీపీ హయాంలో రెహ్మత్ నగర్‌లో షాధీ ఖానాకు రూ.63 లక్షల మైనార్టీ వెల్ఫేర్ నిధులు, రూ.25 లక్షలు ఎంపీ నిధులు విడుదల చేసి కార్పొరేషన్ కమిషనర్ వారి ఖాతాకు జమచేయగా దాని నిర్మాణం చేపట్టేందుకు టెండర్లు పిలిచామని దాని నిర్మాణ పనులు ముందకు సాగకుండా జగన్ ప్రభుత్వం ఆపేసిందన్నారు. ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ కూటమి అభ్యర్ధిగా పోటీచేస్తున్న తన కుమారుడు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను, ఎంపీగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురందేశ్వరిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.