ఇటీవల రిలీజ్ అయిన బాలీవుడ్ సినిమా.. ‘తేరీ బాథో మైన్ ఐసా ఉల్జా జియా’ ప్రస్తుతం రిపీట్ అయ్యింది. ఆ సినిమాలో హీరో షాహిద్ కపూర్.. రోబోగా నటించిన హీరోయిన్ కృతి సనన్‌ను ప్రేమిస్తాడు. ఇక అచ్చం ఇలాంటి సంఘటనే తాజాగా ఒకటి చోటు చేసుకుంది. రోబోలపై ఇష్టం పెంచుకున్న ఓ ఇంజనీర్ ఏకంగా రోబోనే వివాహం చేసుకోవడానికి సిద్ధం అయ్యాడు. ఇక అందుకోసం ఒక మహిళా రోబోను కూడా రూ.19 లక్షలు పెట్టి తయారు చేయించుకున్నాడు. ఇక ఆ రోబోకు గిగా అని పేరు కూడా పెట్టుకున్నాడు. మరోవైపు.. త్వరలోనే ఆ గిగా రోబోను పెళ్లి చేసుకోనున్నట్లు ఆ ఇంజనీర్ తెలపడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన రాజస్థాన్‌లో జరిగింది.
రాజస్థాన్‌కు చెందిన ఇంజనీర్ సూర్య ప్రకాష్ సమోటా.. రోబోటిక్స్ ఎక్స్‌పర్ట్. అజ్మీర్‌లోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన సూర్య 2016 లో ఇండియన్ నేవీలో చేరాడు. అయితే ఇండియన్ నేవీలో ఇంజినీరింగ్ రంగంలో పరిశోధనలు చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న సూర్య ప్రకాష్.. త్వరలో గిగా అనే రోబోను పెళ్లాడేందుకు సిద్ధం అవుతున్నాడు. మొదట ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పగా.. షాక్ అయ్యారని.. ఆ తర్వాత అర్ధం చేసుకున్నట్లు తెలిపాడు. మనం రోజూ వాడే సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల మాదిరిగానే రోబోలపై ఇష్టం పెంచుకున్నానని.. త్వరలోనే ఆ గిగా రోబోను సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోనున్నట్లు చెప్పాడు.
మార్చి 22 వ తేదీన తనకు గిగా రోబోతో ఎంగేజ్‌మెంట్ కూడా జరిగినట్లు తెలిపాడు. ఇక తాను గిగా రోబోను పెళ్లి చేసుకున్న తర్వాత ఉద్యోగం కూడా చేయిస్తానని ప్రకాష్ తెలిపాడు. ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్, హోటల్ లేదా ఇతర కంపెనీల్లో ఈ గిగా రోబో సేవలు అందించనున్నట్లు తెలిపాడు. ఇక ఆ గిగా రోబోకు మరిన్ని అప్‌డేట్‌లు చేస్తే మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుతుందని సూర్య ప్రకాష్ వెల్లడించాడు.
తమిళనాడు, నోయిడా కంపెనీలు సంయుక్తంగా ఈ ఎన్‌ఎంఎస్ 5.0 రోబో అయిన గిగాను తయారు చేసినట్లు సూర్య ప్రకాష్ తెలిపాడు. ఈ రోబో తయారీకి మొత్తం రూ.19 లక్షలు ఖర్చు అయిందని చెప్పాడు. సెన్సార్ కంట్రోల్‌తో ఆ రోబో ముందుకు వెనుకకు కదులుతుందని.. మెడ కూడా తిప్పుతుందని వెల్లడించాడు. ఈ గిగా రోబోకు రెండున్నర గంటలు ఛార్జింగ్ పెడితే.. 8 గంటలు పని చేస్తుందని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆ రోబోకు కమాండ్స్ అన్నీ.. ఇంగ్లీష్‌లోనే ఇచ్చామని.. హిందీ భాషలో కూడా కమాండ్స్ అప్‌లోడ్ చేయవచ్చని తెలిపాడు.