ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ ట్రాక్ రికార్డ్ ఏంటో అందరికీ తెలుసు.. ఐరాసలో పాక్‌‌కు భారత్ దిమ్మదిరిగే కౌంటర్

national |  Suryaa Desk  | Published : Fri, May 03, 2024, 11:23 PM

ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో పాకిస్థాన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు భారత్ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చింది. అన్ని అంశాలలో పాకిస్థాన్ ఘనమైన ట్రాక్ రికార్డ్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసనని దాయాది తీరును ఐరాసలో భారత శాశ్వత రాయబారి రుచిరా కాంబోజ్ ఎండగట్టారు. గురువారం ఐరాస జనరల్ అసెంబ్లీలో మాట్లాడిన పాక్ ప్రతినిధి మునిర్ అక్రమ్ భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశాడు. కశ్మీర్ వివాదం, పౌరసత్వ సవరణ చట్టం, అయోధ్యలోని రామమందిరం సహా దేశంలోని పలు అంశాలను ప్రస్తావించడంతో రుచిరా కాంబోజ్ దీటుగా బదులిచ్చారు. తాము శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తుంటే.. వారి విధ్వంసక స్వభావంతో దానికి తూట్లు పొడుస్తారని చెప్పుతో కొట్టినట్టు మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల సమయంలో శాంతియుత వాతావరణాన్ని పెంపొందించడానికి మేము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మా దృష్టంతా నిర్మాణాత్మక చర్చలపై ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.


‘చర్చల కోసం నిర్దిష్ట ప్రతినిధి బృందాన్ని నియమిస్తాం.. కానీ వారి విధ్వంసక, ప్రమాదకర స్వభావం మా ప్రయత్నాలను భగ్నం చేస్తోంది.. దౌత్యం విషయంలో కేంద్ర సూత్రాలకు అనుగుణంగా ఆ ప్రతినిధి బృందాన్ని ప్రోత్సహిస్తాం.. అన్ని విషయాల్లోనూ అత్యంత చెత్త ట్రాక్ రికార్డ్‌ ఉన్న దేశం తమ గురించి మాట్లాడటం సిగ్గుచేటు’ అని రుచిరా మండిపడ్డారు. శాంతి, కరుణ, అవగాహన, కలిసిమెలిసి జీవించాలనేది అన్ని మతాల సారంశమని, దీనికి ఉగ్రవాదం వ్యతిరేకమని ఆమె నొక్కి చెప్పారు. ‘ఉగ్రవాదం అసమ్మతిని రగిలించి, సాంస్కృతిక, మతపరమైన సంప్రదాయాలకు ముఖ్యమైన సార్వత్రిక విలువలను బలహీనపరుస్తుంది.. శాంతిని పెంపొందించి, ప్రపంచం ఒకే కుటుంబంగా ఉండాలనేది మా అభిమతం.. ఇందుకు ఐరాస సభ్య దేశాలు కలిసి పనిచేయడం చాలా అవసరం’ అని రుచిర అన్నారు. ప్రపంచంలో మతం ఆధారంగా పెరుగుతున్న అశాంతి, వివక్ష, హింసలపై తక్షణమే దృష్టి సారించాలని ఐరాసను కోరారు. చర్చిలు, ప్రార్ధాన మందిరాలు, గురుద్వారాలు, మసీదులు, ఆలయాలు సహా పవిత్ర స్థలాలపై జరుగుతున్న దాడులు ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. ఇటువంటి కీలక అంశాలపై చర్చించాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు.


ఈ సందర్భంగా ప్రపంచ శాంతి స్థాపనలో జాతిపిత మహాత్మా గాంధీ సూచించిన అహింసా మార్గానికి భారత్ కట్టుబడి ఉందని రుచిర కాంబోజ్ ఉద్ఘాటించారు. ‘భారతదేశం హిందూ, బౌద్ధం, జైన, సిక్కు మతాలకు జన్మస్థలం మాత్రమే కాదు.. ఇస్లాం, క్రైస్తవం, జడాయిజం, జొరాస్ట్రియన్లకు కూడా బలమైన కోట... ఇది చారిత్రికంగా అన్ని మత విశ్వాసాలకు, వైవిధ్యాలకు పుటిల్లు..’ అని పేర్కొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa