ఏపీలో రాజకీయాలు క్లైమాక్స్ చేరుకున్నాయి. మరో 8 రోజుల్లో పోలింగ్ జరగనుండగా.. పార్టీలన్నీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. అయితే మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ.. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి, మంత్రి అంబటి రాంబాబుకు షాక్ తగిలింది. ఆయన అల్లుడు గౌతమ్ విడుదల చేసిన వీడియో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుకు ఓటు వేస్తే పవిత్రమైన ఎమ్మెల్యే పదవి అపవిత్రమవుతుందని రాంబాబు చిన్నల్లుడు గౌతమ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్న గౌతమ్.. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అంబటి రాంబాబుకు అల్లుణ్ని కావటం నా దురదృష్టం. ఆయనకి వ్యక్తిత్వం లేదు. శవాల మీద పేలాలు ఏరుకునే రకం. ఇలాంటి వ్యక్తి నా జీవితంలో ఎదురుకాకూడదని రోజూ దేవుడికి దండం పెట్టుకుంటా. ఈ విషయం ఇప్పుడెందుకు చెప్తున్నాననంటే.. ఆయన పోటీ చేసే పదవి అలాంటిది. ఎమ్మెల్యే అంటే విలువలు, మంచితనం ఉండాలి. బాధ్యత ఉండాలి. వందశాతం కాకపోయినా కనీసమైనా ఉండాలి. అలాంటివి కొంచెం కూడా లేని వ్యక్తి ఆయన. నిస్సిగ్గుగా పెద్ద గొంతు వేసుకొని అబద్ధాన్ని కూడా నిజం చేసేయగలమనే కాన్ఫిడెన్స్‌తో బతుకుతారు. ఎంత లేకి పని అయినా చేసి సమాజంలో చాలా గౌరవంగా బతుకుతామని అనుకుంటారు. ఇలాంటి వ్యక్తికి ఓటేస్త్తే చెడును మనమే ప్రోత్సహించినట్లు ఉంటుంది. ప్రజలు గమనించి మంచి వ్యక్తికి ఓటేయాలి" అంటూ గౌతమ్ వీడియో విడుదల చేశారు.
అయితే అంబటి రాంబాబు చిన్నల్లుడు గౌతమ్ విడుదల చేసిన వీడియోపై వైసీపీ స్పందించింది. దీని వెనుక జనసేన నేతలు ఉన్నారని ఆరోపిస్తోంది. మొన్న ముద్రగడ గారి కూతురితో వీడియో.. ఈరోజు అంబటి రాంబాబు గారి అల్లుడు గౌతమ్‌తో వీడియో చేయించారని విమర్శించింది. అంబటి రాంబాబు కూతురు తన భర్త గౌతమ్ అరాచకాలు భరించలేక పిల్లలతో కలిసి దూరంగా ఉంటోందని.. ఆ వ్యక్తిగత విభేదాన్ని కూడా జనసేన రాజకీయం చేస్తోందని విమర్శించింది. మరోవైపు అంబటి రాంబాబు రెండో కూతురు భర్త గౌతమ్. ఇద్దరూ డాక్టర్లు కావటంతో రెండు కుటుంబాలు వివాహం జరిపించాయి. అయితే విభేదాలు రావటంతో గత నాలుగేళ్లుగా వీరిద్దరూ విడిగా ఉంటున్నారు. అయితే ఇది తట్టుకోలేక గౌతమ్ ఇలా.. అంబటి రాంబాబు విమర్శిస్తూ వీడియో చేశారని వైసీపీ ఆరోపిస్తోంది.