ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోరు గతంలో ఎన్నడూ లేనంత రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో గెలవడం కోసం ఓవైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. మరోవైపు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తీవ్రంగా పోరాడుతున్నాయి. మండుటెండలను సైతం లెక్క చేయకుండా నేతలు ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుతుపున్నారు. జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి నేతలు రాష్ట్రమంతా చుట్టొస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రతి సీటూ కీలకంగా మారడంతో.. పార్టీలు ఏమాత్రం రిస్క్ తీసుకోవడం లేదు. జిల్లాల వారీగా స్పెషల్ ఫోకస్ పెట్టి విజయానికి వ్యూహాలు రచిస్తున్నాయి. ఏపీలోని మిగతా జిల్లాల సంగతి ఎలా ఉన్నా.. ఒక్క జిల్లా మాత్రం విజేత వైపే స్పష్టంగా మొగ్గు చూపుతుంది. గత రెండు ఎన్నికల్లోనూ ఈ జిల్లా ఓటర్లు చాలా స్పష్టమైన తీర్పును ఇచ్చారు. అదే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.
గోదావరి జలాలతో పంటలు సమృద్ధిగా పండే పశ్చిమ గోదావరి జిల్లా.. అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంది. ఎన్నికల సమయంలో విజేతను డిసైడ్ చేయడంలోనూ ఈ జిల్లా ముందు ఉంటోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పూర్తిగా టీడీపీ వైపు మొగ్గింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ 14 స్థానాల్లో గెలవగా.. దాని మిత్రపక్షమైన బీజేపీ తాడేపల్లిగూడెంలో విజయం సాధించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. జగన్ సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లాలో కనీసం ఖాతా తెరవలేకపోయింది.
ఇక 2019 ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘పశ్చిమ’లోని 15 నియోజకవర్గాలకు గానూ వైఎస్సార్సీపీ 13 చోట్ల జయకేతనం ఎగురవేయగా.. ఉండి, పాలకొల్లు నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. భీమవరం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం వైఎస్సార్సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. జగన్ పాదయాత్ర ప్రభావంతో.. మిగతా అన్ని జిల్లాల్లోలాగే ఇక్కడ సైతం ఫ్యాన్ గాలి బలంగా వీచింది. అంతే కాదు భారీగా ఓట్లు చీల్చిన జనసేన.. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీని తీవ్రంగా నష్టపర్చింది. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తుండటంతో 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని టీడీపీ కూటమి ఆశిస్తోంది. కాగా తమ సంక్షేమ పథకాల కారణంగా పశ్చిమలో ఈసారి కూడా మెజార్టీ స్థానాల్లో గెలుస్తామని వైఎస్సార్సీపీ ధీమాతో ఉంది. ఏలూరు, కొవ్వూరు, ఉంగుటూరు, గోపాలపురం, ఉండి, ఆచంట, చింతలపూడి, దెందులూరు, తణుకు, తాడేపల్లిగూడెం, నర్సాపురం, నిడదవోలు, భీమవరం, పాలకొల్లు, పోలవరం.
2024 అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్సార్సీపీ ఒకేసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అయితే టీడీపీ మాత్రం చివరి వరకు దెందులూరు స్థానాన్ని పెండింగ్‌లో ఉంచింది. కానీ చివరకు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు కేటాయించింది. 2019 ఎన్నికల్లో నర్సాపురం నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణంరాజుకు.. 2024 ఎన్నికల్లో టీడీపీ ఉండి ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వేటుకూరి వెంకట శివ రామ రాజు (కాల్వపూడి శివ) రెబల్‌గా బరిలో ఉండటం టీడీపీకి తలనొప్పిగా మారింది. గత ఎన్నికల్లో కొవ్వూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన హోం మంత్రి తానేటి వనిత ఈసారి గోపాలపట్నం నుంచి పోటీ చేస్తున్నారు. ఏలూరు నుంచి మాజీ మంత్రి ఆళ్ల నాని మరోసారి బరిలో ఉన్నారు. భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, పోలవరం నియోజకవర్గాల్లో జనసేన పోటీలో ఉండగా.. కైకలూరు నుంచి బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2024 ఎన్నికల్లో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు..
నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి టీడీపీ కూటమి అభ్యర్థి
చింతలపూడి కంభం విజయరాజు సోంగ రోషన్
దెందులూరు కొఠారు అబ్యయ్య చౌదరి చింతమనేని ప్రభాకర్
పోలవరం తెల్లం రాజ్యలక్ష్మి చిర్రి బాలరాజు (జనసేన)
గోపాలపురం తానేటి వనిత మద్దిపాటి వెంకటరాజు
కొవ్వూరు తలారి వెంకట్రావు ముప్పిడి వెంకటేశ్వర రావు
ఉంగుటూరు పుప్పాల వాసు బాబు పత్సమట్ల ధర్మరాజు (జనసేన)
ఏలూరు ఆళ్ల నాని బడేటి రాధాకృష్ణ
నూజివీడు మేకా వెంకట ప్రతాప అప్పారావు కొలుసు పార్థసారథి
కైకలూరు దూలం నాగేశ్వర రావు కామినేని శ్రీనివాసరావు ( బీజేపీ)
ఆచంట సీహెచ్ శ్రీరంగనాథ రాజు పితాని సత్యనారాయణ
పాలకొల్లు గుడాల శ్రీహరి గోపాల రావు నిమ్మల రామానాయుడు
తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ బొలిశెట్టి శ్రీనివాస్ (జనసేన)
నర్సాపురం ముదునూరి ప్రసాద రాజు బొమ్మిడి నాయకర్ (జనసేన)
భీమవరం గ్రంధి శ్రీనివాస్ పులపర్తి రామాంజనేయులు (జనసేన)
తణుకు కారుమూరి నాగేశ్వరరావు అరిమిల్లి రాధాకృష్ణ
ఉండి పీవీఎల్ నర్సింహరాజు రఘురామకృష్ణంరాజు