రికార్డు ఉష్ణోగ్రతలు, ఉక్కబోతతో అల్లాడుతున్న ఏపీవాసులకు వరుణుడు ఉపశమనం కలిగించాడు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం వాతావరణం చల్లబడింది. ఉపరితల ద్రోణి కారణంగా పలుచోట్ల భారీవర్షం కురవగా... మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి జనం కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో రెండు గంటలపాటు భారీ వర్షం కురిసింది. రాజమండ్రిలోని ఆర్టీసీ కాంప్లెక్స్, వీఎల్ పురం ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా.. రోడ్లపై భారీగా వరదనీరు చేరింది. భారీ వర్షానికి కార్లు, బైక్లు నీటిలో కొట్టుకుపోయాయి. గుంటూరు, పల్నాడు జిల్లాలలోనూ భారీ వర్షం కురిసింది. ఏలూరు జిల్లాలో ఈదురు గాలులు, భారీ వర్షానికి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మరోవైపు మంగళవారం సాయంత్రానికి తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో 124.5మిమీ, కోనసీమ జిల్లా మండపేటలో120.5 మిమీ, రాజమహేంద్రవరంలో 92 మిమీల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది.
మరోవైపు తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ విస్తరించిన ద్రోణి కారణంగా.. ఏపీలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ద్రోణి ప్రభావంతో బుధవారం శ్రీకాకుళం, అల్లూరి, నెల్లూరు, పల్నాడు, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. విజయనగరం,మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి,కాకినాడ,అనంతపురం, సత్యసాయి, వైయస్సార్, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని.. పొలాల్లో పనిచేసే రైతులు,వ్యవసాయ కూలీలు,పశువుల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. గురువారం విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, కాకినాడ జిల్లాలలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa