ఏపీలో పోలింగ్ ముగిసినప్పటికీ పలుచోట్ల హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. విపక్ష టీడీపీ, అధికార వైసీపీ వర్గాలు.. దాడులకు పాల్పడుతున్నాయి. పల్నాడు జిల్లా, చంద్రగిరి, తాడిపత్రి ప్రాంతాల్లో ఉద్రిక్తతలు.. తగ్గుముఖం పట్టడంలేదు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఏపీ డీజీపీకి ఫోన్ చేశారు. టీడీపీ పార్టీ కార్యకర్తలు, ఆస్తులపై వైసీపీ శ్రేణులు చేస్తున్న దాడులు, విధ్వంసాలపై చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు. తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి ఘటనలను ప్రస్తావించారు. మాచర్లలో ప్రైవేట్ సైన్యంతో పిన్నెళ్లి దాడులకు పాల్పడుతున్నారన్న చంద్రబాబు నాయుడు.. అన్ని గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే అదనపు బలగాలను తరలించారని కోరారు. శాంతిభధ్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్న చంద్రబాబు నాయుడు.. దాడులకు పాల్పడుతున్నవారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు మంగళవారం తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీలో... చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై.. దాడి జరిగింది. స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి వస్తున్న సమయంలో నాని కారుపై వైసీపీ శ్రేణులు దాడిచేశాయి. ఈ ఘటనలో నాని సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారు. కారు ధ్వంసమైంది. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. టీడీపీ మహిళా సంఘాల నేతలు.. వర్సిటీ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
అటు మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడిలోనూ ఉద్రిక్తతలు తలెత్తాయి. కారంపూడిలోని టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి.కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. టీడీపీ కార్యాలయం సమీపంలో ఉన్న వాహనాలను సైతం ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే దాడులు ఆపేందుకు యత్నించిన సీఐపైనా దాడిచేశారు. అటు తాడిపత్రిలోనూ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది.ఈ రాళ్ల దాడిలో తాడిపత్రి సీఐ మురళీకృష్ణకు గాయాలు అయ్యాయి. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ నేతలు రాళ్ల దాడికి పాల్పడటంతో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంటివైపు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ వందలాది మంది కార్యకర్తలతో కలిసి బయలుదేరారు.
మరోవైపు హింసాత్మక ఘటనల నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఏపీ డీజీపీకి ఫోన్ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. హింసాత్మక ఘటనలు జరుగుతున్న చోట్ల పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి.. ఉద్రిక్త పరిస్థితులు చల్లారేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.