ఆంధ్రప్రదేశ్‌లో ఓటు వేసేందుకు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన ఓటర్లు భారీగా తరలివచ్చారు. బస్సులు, రైళ్లు, సొంత వాహనాల్లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ విశాఖపట్నంకు చెందిన ఓటర్లకు మాత్రం విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఓటు వేద్దామని 900 కిలో మీటర్లు ప్రయాణించి సొంత ఊరికి వెళ్లిన ఓటర్లకు నిరాశ మిగిలింది. అంత దూరం కష్టపడి వెళ్లినా ఓట్లు వేయలేకపోయారు.
విశాఖపట్నంతో పాటూ చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన పలువురు పలువురు ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఉంటున్నారు. వారంతా సొంత ఊళ్లలో ఓటు వేద్దామని బయల్దేరారు.. ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్నారు. నాందేడ్ నుంచి విశాఖపట్నం వచ్చే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరాల్సి ఉంది. కానీ ఆరు గంటలు ఆలస్యంగా నాందేడ్ నుంచి బయల్దేరింది. సోమవారం ఉదయం 5.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంది.
బయలుదేరాల్సిన రైలు ఆరు గంటలు ఆలస్యమైంది. ఆ రైలు సోమవారం ఉదయం 5.50 గంటలకు సికింద్రాబాద్ వచ్చింది. అక్కడి నుంచి బయల్దేరి షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం 9.10 గంటలకు విశాఖ రావాల్సి ఉండగా.. ఏకంగా 9 గంటలు ఆలస్యమైంది. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.. సొంత ఊరికి వెళ్లి ఓటు వేయలేమోనని కంగారుపడ్డారు. రైల్వే స్టేషన్‌లలో స్టేషన్ మాస్టర్లకు తమ సమస్యను వివరించారు.. ఫిర్యాదులు చేశారు. రైలు వేగంగా వెళ్లేలా చూడాలని కోరారు. తాము ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని వీడియోలు తీసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు.
అయినా సరే ఆ రైలు ఆలస్యంగా నడిచింది.. ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఏకంగా 8 గంటలకుపైగా ఆలస్యంగా సాయంత్రం 5.17 గంటలకు విశాఖపట్నం చేరుకుంది. 40 నిమిషాలు సమయం ఉండటంతో వేగంగా ఇంటికి వెళ్లి ఓటు వేసేందుకు ప్రయత్నించారు. కానీ వీళ్లంతా పోలింగ్ కేంద్రాలకు వెళ్లే సమయానికి పోలింగ్ ముగిసింది.. గేట్లు మూసివేశారు. సమయం ముగిసిందని చెప్పడంతో నిరాశచెందారు.. తాము చాలా దూరం నుంచి వచ్చామని ఓటు వసేందుకు అనుమతించాలని వేడుకున్నా పట్టించుకోలేదు.. దీంతో నిరాశతో అక్కడి నుంచి వెనక్కు వచ్చేశారు.