ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తైంది. సుమారుగా 80 శాతం మంది ఓటర్లు రాబోయే ఐదేళ్లపాటు తమను ఎవరు పాలించాలనే దానిపై తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. చాలా ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకూ ఓటింగ్ కొనసాగింది. సాయంత్రం ఆరుగంటలకే పోలింగ్ ముగిసినప్పటికీ.. అప్పటికే క్యూలైన్లలో చేరినవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో పోలింగ్ పూర్తయ్యేసరికి చాలాచోట్ల అర్ధరాత్రి దాటినట్లు తెలిసింది. ఇక పోలింగ్ ప్రక్రియ పూర్తికావటంతో ఈవీఎం యంత్రాలను పోలింగ్ సిబ్బంది.. స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు.
అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటింగ్‌కు.. కౌంటింగ్‌కు మధ్య 21 రోజుల గ్యాప్ ఉంది. దీంతో ఈవీఎంలలో వేసిన ఓట్లు ఎన్నిరోజుల వరకూ భద్రంగా ఉంటాయనే విషయాన్ని తెలుసుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. పోలింగ్ పూర్తయ్యిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. పటిష్ట భద్రత మధ్య పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. ఈవీఎంలతో పాటుగా వీవీప్యాట్‌లను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. కౌంటింగ్ రోజు వరకూ ఈ యంత్రాలు స్ట్రాంగ్ రూమ్‌లలోనే ఉండనున్నాయి.
ఇక స్ట్రాంగ్ రూమ్ గదులకు రెండు తాళాలు వేస్తారు. ఓ తాళం జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉంటుంది. మరో తాళాన్ని నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వద్ద ఉంచుతారు. ఇక కౌంటింగ్ రోజు వరకూ ఈ గదుల వద్ద మూడంచెల భద్రత ఉంటుంది. సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. అలాగే ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రతిరోజూ స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణాలను తనిఖీ చేయాల్సి ఉంటుంది.
మరోవైపు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో పదేళ్లపాటు డేటా భద్రంగా ఉంటుంది. ఈవీఎం మెషీన్లను ఈసీఐఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ సంయుక్తంగా రూపొందించాయి. ఈవీఎం మెషీన్ 15 ఏళ్లపాటు పనిచేస్తాయంటున్న ఎన్నికల అధికారులు.. ఓట్లకు సంబంధించిన డేటాను ఈవీఎంలోని కంట్రోల్ యూనిట్ పదేళ్లకుపైగా భద్రపరచగలదని చెప్తున్నారు. 2000-2005 నాటి ఈవీఎం మెషీన్లలో గరిష్టంగా 3,840 నమోదవుతాయని ఈసీ చెబుతోంది. 2006 నాటి ఈవీఎం మెషీన్లలో ఒక్కోదాంట్లో 2000 ఓట్లు వేయవచ్చు.