లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ముచ్చటగా మూడోసారి ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన తన ఆస్తులు, అప్పుల గురించి ఆ నామినేషన్ పత్రాల్లో వెల్లడించారు. 13 ఏళ్లు సీఎంగా.. 10 ఏళ్లు పీఎంగా పనిచేసిన నరేంద్ర మోదీకి సొంత ఇల్లు, కారు లేవని నామపత్రాల్లో తెలిపారు. అంతేకాకుండా తన పేరు మీద ఎలాంటి షేర్లు లేవని స్పష్టం చేశారు. తన మొత్తం ఆస్తుల విలువ రూ.3.02 కోట్లు అని ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దేశంలో ఎన్నికల్లో పోటీ చేసే ప్రతీ అభ్యర్థి ఈ అఫిడవిట్‌ను తప్పనిసరిగా ఎన్నికల కమిషన్‌కు దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే నరేంద్ర మోదీ మొత్తం రూ.3.02 కోట్ల ఆస్తుల్లో ఏమేం ఉన్నాయి అనేది కూడా ఆయన వివరించారు. ప్రస్తుతం ప్రధాని మోదీ వద్ద రూ.52,920 ఉన్నాయని తెలిపారు. ఇక బ్యాంకు అకౌంట్‌లో రూ.80,304 ఉన్నాయని చెప్పారు. నరేంద్ర మోదీ పేరు మీద రూ.2.85 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇవేకాకుండా రూ.2.67 లక్షల విలువైన 4 బంగారు ఉంగరాలు ఉన్నాయని తెలిపారు. ఇక రూ.9.12 లక్షలను నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్-ఎన్ఎస్‌సీలో పెట్టుబడి పెట్టినట్లు వెల్లడించారు. 2019లో దీని విలువ రూ.7.61 లక్షలు ఉండగా.. ఈ 5 ఏళ్లలో దాదాపు రూ.2 లక్షలు పెరిగినట్లు తెలుస్తోంది.
ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు మీద ఎలాంటి భూములు గానీ, షేర్లు గానీ, మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో పెట్టుబడులు గానీ లేవని ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా పొందినట్లు తెలిపారు. 1978 లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి అయినట్లు తెలిపారు. 1967 లో గుజరాత్ బోర్డు నుంచి ఎస్ఎస్‌సీ పాస్ అయినట్లు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే జీతం, బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ తన ఆదాయ మార్గాలని వివరించారు. వారణాసి నియోజకవర్గం నుంచి 2014 లో మొదటిసారి.. 2019 లో రెండోసారి ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక 2014 లో నరేంద్ర మోదీ మొత్తం ఆస్తుల విలువ రూ.1.66 కోట్లు అని.. 2019 లో రూ.2.51 కోట్లు అని తెలిపినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్-ఏడీఆర్ నివేదిక ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన భార్య పేరు జశోదాబెన్ అని పేర్కొన్నారు. అయితే ఆయన భార్య జశోదాబెన్ ఆదాయం గురించి తెలియదు అని రాశారు. ఆమె వృత్తి ఏంటి అనేది కూడా వెల్లడించలేదు. ఇక తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వానికి తాను ఎలాంటి బకాయిలు లేనని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.