బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ.. క్యాన్సర్‌తో సోమవారం కన్నుమూశారు. అయితే ఆయన రాజకీయాలు, సిద్ధాంత పరంగా బీజేపీ, ఆరెస్సెస్ భావజాలం ఉన్నప్పటికీ.. వ్యక్తిగత విషయాల్లో మాత్రం మతపరమైన తేడా చూడలేదు. అందుకు ప్రత్యక్ష నిదర్శనమే ఆయన వివాహం. చిన్నతనం నుంచే ఆరెస్సెస్ వైపు పయనించిన సుశీల్ కుమార్ మోదీ.. ఓ క్రిస్టియన్ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆయన పెళ్లిని బీజేపీ అగ్రనేత, దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ సమక్షంలో జరగడం గమనార్హం.
సుశీల్ కుమార్ మోదీ రాజకీయ ప్రయాణం విద్యార్థిగా ఉన్న సమయంలోనే బీహార్‌లోని పాట్నా యూనివర్సిటీ నుంచే ప్రారంభం అయింది. మొదట అఖిల భారత విద్యార్థి పరిషత్-ఏబీవీపీలో చేరిన సుశీల్ కుమార్ మోదీ.. ఏళ్లు గడిచేకొద్దీ.. అందులో రకరకాల హోదాల్లో పనిచేశారు. ఆ తర్వాత 1990 లో రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే యూనివర్సిటీలో చదువుకునేటపుడే తన క్లాస్‌మేట్ కేరళకు చెందిన క్రిస్టియన్ జెస్సీ జార్జ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
అయితే అప్పటికే ఏబీవీపీలో పనిచేస్తున్న సుశీల్ కుమార్ మోదీ.. 1986 ఆగస్ట్ 13 వ తేదీన జెస్సీ జార్జ్‌ను వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లికి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి హాజరు కావడం గమనార్హం. వీరి పెళ్లి జరిగిన 4 ఏళ్లకు అంటే 1990లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో సుశీల్ మోదీ ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాల్లోకి వచ్చారు. సుశీల్ కుమార్ మోదీ రాజకీయాల వైపు అడుగులు వేయగా.. జెస్సీ జార్జ్ మాత్రం కాలేజ్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. వారిద్దరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి పేర్లు ఉత్కర్ష్ తథాగత, అక్షయ్ అమృతాంశు.
ఆరెస్సెస్, ఏబీవీపీల్లో పనిచేసిన సుశీల్ కుమార్ మోదీ.. ఆ తర్వాత బీజేపీ తరఫున రాజకీయాల్లో ఎన్ని రకాల సేవలు అందించారు. 72 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో పోరాడుతూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో సోమవారం తుది శ్వాస విడిచారు. అయితే గత 6 నెలలుగా క్యాన్సర్‌తో పోరాటం చేసిన సుశీల్ కుమార్ మోదీ.. గత నెల 3 వ తేదీన ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
బీజేపీ బీహార్ లెజిస్లేచర్ పార్టీ చీఫ్ విప్‌గా, బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా, నితీశ్ కుమార్ ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా బీహార్‌లోని భాగల్పూర్ నియోజవర్గం నుంచి లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు. 2005 నుంచి 2013 వరకు ఒకసారి.. 2017 నుంచి 2020 వరకు రెండోసారి బీహార్ ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.