ప్రజాస్వామ్యంలో ఓటే అతిపెద్ద ఆయుధం. మనం ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకుంటేనే వచ్చే ఐదేళ్ల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని మంచిగా పాలిస్తారు. ఈ క్రమంలోనే ఓటింగ్ పెంచేందుకు కూడా ఎన్నికల సంఘం అధికారులు అన్ని రకాల ప్రచారాలు, ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొనేవారు ఉంటారో వారు పోలింగ్‌కు ముందే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తారు. ఇక ప్రైవేటు కంపెనీలు కూడా పోలింగ్ రోజు ఓటు వేసేందుకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశాలు కూడా ఉంటాయి. కానీ చాలా మంది సెలవు ఉన్నా ఓటు వేయకుండా బద్ధకంగా ఇంట్లోనే కూర్చుంటారు. మరికొందరు సెలవు పేరు చెప్పుకుని బయటికి వెళ్లి తిరుగుతారు. ఈ క్రమంలోనే అసలు ఓటు వేయకుంటే ఫైన్లు విధించడం, చర్యలు తీసుకునే దేశాలు కూడా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో ప్రజలు ఓటింగ్ తప్పనిసరి ఉంటుంది. దాని కోసం చట్టాలు కూడా చేశారు. ఆ దేశాల్లో ఓటు వేయకుంటే జరిమానాలు, కఠిన శిక్షలు కూడా అమలు చేస్తున్నారు. 2023 జనవరి నాటికి ప్రపంచంలోని దాదాపు 21 దేశాలు ఓటు వేయడాన్ని తప్పనిసరి చేశాయి. అయితే 11 దేశాలు మాత్రమే దీన్ని కఠినంగా అమలు చేస్తున్నాయి.
1924 నుంచి ఆస్ట్రేలియాలో నిర్బంధ ఓటింగ్‌ను ప్రవేశపెట్టారు. ఆస్ట్రేలియాలో ఓటు వేయని వారికి జరిమానాలు విధిస్తారు.
బెల్జియంలో ఓటు వేసే వయసు వచ్చినా ఓటు కోసం నమోదు చేసుకోనివారికి ఫైన్లు వేస్తున్నారు. ఒక ఓటరు వరుసగా నాలుగు ఎన్నికల్లో ఓటు వేయకుంటే వారిపై నిషేధం విధిస్తున్నారు. పదేళ్లపాటు వారు ఓటు వేసే హక్కును కోల్పోతారు
బ్రెజిల్ దేశంలో ఓటు వేయడం ఒక బాధ్యతగా భావిస్తారు. అక్కడ 18 ఏళ్లు దాటిన వారు ఓటు వేయకుంటే వారి జీతాన్ని కట్ చేస్తారు.
ఈక్వెడార్‌లో కూడా ఓటు వేయడం తప్పనిసరి చేశారు. ఓటు వేయకుంటే పౌరులకు లభించే హక్కులను కోల్పోతారు.
సింగపూర్‌లో ఓటు వేయని వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగిస్తారు. సింగపూర్‌లో ఓటు వేసేందుకు 21 ఏళ్లు నిండిన వారికి అర్హత ఉంటుంది.
అర్జెంటీనాలో ఓటింగ్ వేయడం తప్పనిసరి చేశారు. అర్జెంటీనాలో 112 ఏళ్ల నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు
లీచ్‌టెన్‌స్టెయిన్‌లో ఓటు వేయని వ్యక్తి.. ఎందుకు రాలేదో ఖచ్చితమైన కారణం చెప్పాలి. లేని పక్షంలో వారికి ఫైన్ వేస్తారు.
లక్సెంబర్గ్‌లో పౌరులు ఓటు వేయడం తప్పనిసరి. 75 ఏళ్లు పైబడిన వారు సరైన కారణం చూపించి ఓటు వేయకుండా ఉండవచ్చు.
నౌరులో 1965లో ఆస్ట్రేలియన్ ఆక్రమణ తర్వాత ఓటు వేయడం తప్పనిసరి చేశారు. ఓటు వేయని వారు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది
పెరూలో 75 ఏళ్లు పైబడిన వృద్ధులు మినహా అందరూ ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల రోజున ఓటు వేయకుంటే జరిమానా వేస్తారు.
సమోవా 2018లో నిర్బంధ ఓటింగ్ విధానాన్ని ప్రారంభించారు. 2021 సాధారణ ఎన్నికల్లో అమలు కూడా చేశారు. ఓటు వేయని వారికి జరిమానా విధిస్తారు.