నంద్యాల జిల్లా, ఆల్లగడ్డలో ఉద్రిక్తత పరిస్థతి నెలకొంది. టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ అనుచరుడు నిఖిల్‌పై ప్రత్యర్థులు దాడి, హత్యయత్నానికి ప్రయత్నించారు. సినీ పక్కీలో దాడి జరిగింది. మంగళవారం రాత్రి నిఖిల్ తన స్నేహితులతో కలిసి అఖిలప్రియ ఇంటి ముందు ఉన్నారు. ఈ క్రమంలో నిఖిల్‌ను టార్గెట్ చేసిన దుండగులు కారుతో వేగంగా వచ్చి ఢీ కొట్టారు. కిండ పడిన నిఖిల్‌పై కారులో వచ్చిన దుండగులు రాడ్లతో దాడికి యత్నించారు. దీంతో నిఖిల్ తప్పించుకుని అఖిలప్రియ ఇంట్లోకి వెళ్లిపోయాడు. అక్కడున్నవారు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు కారులో పారిపోయారు.రెక్కీ నిర్వహించి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నిఖిల్ తలకు గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అఖిలప్రియ వెంటనే బయటకు వచ్చి దాడిపై ఆరా తీశారు.పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి సీసీ పుటేజ్‌ను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలప్రియ పోలీసులను డిమాండ్ చేశారు.