పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైసీపీ మూకల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. మంగళవారం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీపై హత్యాయత్నానికి పాల్పడ్డాయి. తిరుపతిలోని పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ ఆవరణలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ను సందర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో వైసీపీ వర్గీయులు ఆయనపై దాడి చేశారు. సుమారు 150 మంది మారణాయుధాలతో దాడి చేయగా నానీ భుజానికి గాయమైంది. దీనిపై పులివర్తి నానీ వర్గీయులు పోలీసులు ఫిర్యాదు చేయగా దాడులు చేసిన వారిని అరెస్టు చేయకుండా టీడీపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో తిరుచానూరు పోలీస్ స్టేషన్ దగ్గర నానీ భార్య సుధారెడ్డి, టీడీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని, టీడీపీ కార్యకర్తలను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పులివర్తి నానీ సతీమణి సుధారెడ్డి మాట్లడుతూ..నిన్న (మంగళవారం) 3 గంటల ప్రాంతంలో నానీపై హత్యాయత్నం జరిగిందని గన్ మెన్ కాపాడారని, లేకపోతే నానీ ఉండేవారుకాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలు ఇచ్చామని.. దీంతో దాడి చేసిన వారిని గంటలో అరెస్టు చేస్తామని ఎస్పీ చెప్పారని ఇంత వరకు అరెస్టు చేయలేదని అన్నారు. పైగా ముందస్తు చర్యగా తమవాళ్లను స్టేషన్లో పెట్టారని మండిపడ్డారు. ఎస్పీకి భయంగా ఉందంటా.. జూన్ 4వ తేదీ వరకు ఏమీ చేయలేమని ఆయన చెబుతున్నారని.. అంతవరకు మేము ఓపిగ్గా ఉండాలని ఏస్పీ చెబుతున్నారని సుధారెడ్డి తెలిపారు. అయితే 4వ తేదీ వరకు ఎస్పీకి, ఆయన కుటుంబానికి తామే రక్షణ కల్పిస్తామని ఆమె అన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా మాట్లాడితే తామేంచేయాలని సుధారెడ్డి ప్రశ్నించారు.