తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలంరేపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత ప్రత్యక్షమైంది. తెల్లవారుజామున భక్తుల కారులో ఘాట్ రోడ్డులో వెళుతుండగా.. చిరుత అడ్డుగా వచ్చింది. చిరుత సంచారానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గతంలో అలిపిరి నడకమార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతులు కనిపించాయి.. ఈసారి ఘాట్ రోడ్డులో ప్రత్యక్షం కావడం కలకలంరేపింది.
గతేడాది అలిపిరి నడకమార్గంలో చిరుతల సంచారం కలకలంరేపింది. ముందుగా ఓ బాలుడిపై దాడి చేయగా తీవ్ర గాయాలు అయ్యాయి.. ఆ తర్వాత కొంతకాలానికి మరో చిన్నారి లక్షితను చిరుత దాడి చేసి చంపేసింది. దీంతో టీటీడీ, అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.. బోన్లు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుతల్ని బంధించారు. ఏకంగా ఆరు చిరుతల్ని పట్టుకుని తిరుపతిలో జూకు తరలించారు.
అంతేకాదు చిరుతల సంచారంతో టీటీడీ భక్తుల భద్రతకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. నడకమార్గంలో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే చిన్నారులకు అనుమతి ఇచ్చారు. 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి నిరాకరించింది టీటీడీ. అంతేకాదు ఘాట్ రోడ్డులో సాయంత్రం ఆరు గంటల తర్వాత బైక్‌లను అనుమతించలేదు.. అయితే ఈ నిబంధనను తర్వాత సడలించారు. అంతేకాదు భక్తులు గుంపులు, గుంపులుగా వెళ్లాలని టీటీడీ, అటవీశాఖ అధికారులు సూచించారు. అంతేకాదు నడకమార్గంలో వెళ్లే భక్తులకు టీటీడీ చేతి కర్రను కూడా అందించిన సంగతి తెలిసిందే. అయితే చాలా రోజుల తర్వాత మళ్లీ చిరుత తిరుమల ఘాట్ రోడ్డులో ప్రత్యక్షం కావడం కలకలంరేపింది.