నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దారుణం జరిగింది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్‌పై హత్యాయత్నం కలకలంరేపింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. అఖిలప్రియ ఇంటి ముందు నిఖిల్ నిలబడి ఉన్నాడు. ఆయన మరో వ్యక్తితో మాట్లాడుతున్న సమయంలో ఓ కారు అతి వేగంతో దూసుకొచ్చి అతడ్ని ఢీకొట్టింది. నిఖిల్ ఎగిరి కిందపడిపోయాడు.. ఆ వెంటనే ముగ్గురు వ్యక్తులు ఆ కారులో నుంచి బయటకు పరిగెత్తుకొచ్చారు. మారణాయుధాలతో నిఖిల్‌పై దాడి చేశారు.. ఆయన భయంతో వారి నుంచి తప్పించుకుని అఖిలప్రియ ఇంట్లోకి పరిగెత్తారు. దీంతో ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు.
తీవ్రగాయాలతో ఉన్న నిఖిల్‌ను హుటాహుటిన నంద్యాలలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.. పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. అయితే గతంలో నంద్యాలలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై నిఖిల్ దాడి చేయడం కలకలంరేపింది. ఈ క్రమంలోనే నిఖిల్‌పై ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు తిరిగి దాడికి ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.. ముందస్తు జాగ్రత్తగా నేతల ఇళ్ల దగ్గర పోలీసుల్ని మోహరించారు. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి, చంద్రతో పాటు మరో నలుగురిపై ఆళ్లగడ్డ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
2019 ఎన్నికలకు ముందు నుంచి భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య విభేదాలు మొదలయ్యాయి.. ఈ క్రమంలో భూమా అఖిలప్రియ తనను హతమార్చేందుకు ఓ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చిందిని ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.. ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కూడా ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. యువగళం పాదయాత్రలో ఏవీ సుబ్బారెడ్డి దాడి ఘటన కలకలంరేపింది.. తాజాగా భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌పై హత్యాయత్నం కలకలంరేపింది.