కర్నూలు జిల్లాలో వర్షాలు పడటంతో వజ్రాల వేట మొదలైంది. ప్రతి ఏటా తొలకరి వానలు ప్రారంభమయ్యాక వజ్రాల కోసం జనాలు వెతికేవారు.. ఈసారి మాత్రం ముందుగానే వేసవిలో అకాల వర్షాలు పడుతుండటంతో వేట ప్రారంభించారు. తుగ్గలి మండలం జొన్నగిరికి వెళ్లి వజ్రాల అన్వేషణలో జనాలు బిజీ అయ్యారు. జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి ప్రాంతాల్లో రెండు రోజులుగా ఈ వజ్రాల వేట మొదలు పెట్టారు.. ఒక్క వజ్రమైనా దొరక్కపోదా, లక్షలు రాకపోవా అనే ఆశతో వజ్రాల కోసం గాలిస్తున్నారు.
కర్నూలు జిల్లలో వజ్రాల వేట మొదలుకావడంతో పొలాల్లోకి జనాలు వెళుతున్నారు. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.. తమ పొలం పనులకు ఆటంకం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పొలాల దగ్గర కాపలాగా ఉంటున్నారు.. ఎవరూ అటు వైపు రాకుండా చూస్తున్నారు. కొందరు రైతులు తమ పొలాలవైపు వజ్రాల వేట కోసం రావొద్దని బోర్డులు ఏర్పాటు చేశారు. గతేడాది కూడా భారీగా వజ్రాలు దొరికాయి.. కోట్ల విలువ చేసే వజ్రాలు దొరికాయి.. వ్యాపారులు రికార్డు ధరకు కొనుగోలు చేశారు. ఈ ఏడాది ముందుగానే వజ్రాల కోసం జనం గాలిస్తున్నారు. ఇటు ఒకవేళ ఎవరికైనా వజ్రాలు దొరికితే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు కూడా అక్కడే తిష్ట వేశారు. కర్నూలు జిల్లాతో పాటుగా నంద్యాల, అనంతపురం, గుంటూరు, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా వజ్రాలను గాలించేందుకు జనాలు వస్తున్నారు.