ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ సమయంలో తెనాలిలో ఎమ్మెల్యే వర్సెస్ ఓటర్ చెంప దెబ్బ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసిన ఓటర్ గొట్టిముక్కల సుధాకర్ మరోసారి పోలీసుల్ని ఆశ్రయించారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అనుచరుల నుంచి తనతో పాటుగా తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. సుధాకర్ ఏకంగా గుంటూరు క్రైమ్ వింగ్ అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేసి.. వారి నుంచి తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు.
గొట్టిముక్కల సుధాకర్ శుక్రవారం ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు.. అక్కడ ఎస్పీ తుషార్‌ను కలవడానికి ప్రయత్నించగా కుదరలేదు. ఆయన ఓట్ల లెక్కింపు బందోబస్తులో తీరికలేకుండా ఉన్నారు.. దీంతో జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసరావును కలవాలని ఎస్పీ నుంచి సూచన వచ్చింది. సుధాకర్ వెంటనే అదనపు ఎస్పీని కలసి.. ఎమ్మెల్యే శివకుమార్ అనుచరులు.. తెనాలిలోని తన ఇంటితోపాటుగా తల్లి లీలావతి, సోదరి రాణీలత ఇళ్ల దగ్గర.. కొద్ది రోజులుగా అనుమానాస్పదంగా తిరుగుతున్నారని ఆయన ప్రధానంగా ఫిర్యాదు ఇచ్చారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసుల్ని కోరారు.. ఈ ఫిర్యాదుపై స్పందించిన అదనపు ఎస్పీ.. సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన భద్రతా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని సుధాకర్ తెలిపారు.
ఈ నెల 13న తెనాలిలో ఐతానగర్ పోలింగ్ కేంద్రానికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసేందుకు వెళ్లారు. వారంతా క్యూ లైన్‌లో వెళ్లకుండా పక్క నుంచి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు.. అయితే క్యూలో నిలబడి ఉన్న గొట్టిముక్కల సుధాకర్.. ఎమ్మెల్యే శివకుమార్‌ను ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే ఆవేశంగా వెళ్లి సుధాకర్ చెంప చెల్లుమనిపించారు.. సుధాకర్ కూడా శివకుమార్‌ను చెంప దెబ్బ కొట్టారు. ఆ వెంటనే ఎమ్మెల్యే అనుచరుల సుధాకర్‌పై దాడి చేశారు.. ఈ ఘటనలో దెబ్బలు తగిలాయి. ఆ తర్వాత పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.. సుధాకర్‌తో ఓటు వేయించిన పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌తో పాటూ అనుచరులపై కేసులు నమోదు చేశారు. అయితే తాజాగా సుధాకర్ మరోసారి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.
మరోవైపు ఈ ఘటనపై ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వాదన మరోలా ఉంది. తనను సుధాకర్ అనే వ్యక్తి వ్యక్తిగతంగా దూషించారని.. అందుకే ఆ గొడవ జరిగిందన్నారు. ఐతానగర్‌లో తనతో పాటుగా భార్యతో కలిసి ఓటు వేసేందుకు వెళ్లామన్నారు. ఇంతలో సుధాకర్.. ఎమ్మెల్యేగా మాల మాదిగ సామాజిక వర్గాలకు కొమ్ముకాస్తున్నావంటూ తనను దుర్భాషలాడారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీపై ద్వేషంతో దారుణంగా తిట్టినట్లు చెప్పారు. సుధాకర్ బెంగళూరులో ఉంటున్నారని.. ఆయన టీడీపీకి చెందిన కమ్మ సామాజిక వర్గం వ్యక్తి అని తెలిపారు. అసలు కమ్మొడివేనా అంటూ తనను సుధాకర్ దూషించారన్నారు. సుధాకర్ మద్యం మత్తులో అందరి ముందు చాలా దారఉణంగా ప్రవర్తించినట్లు ఆరోపించారు. పోలింగ్ కేంద్రంలో ఆయన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినట్లు తనకు తెలిసిందన్నారు.