ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ నుంచి బయల్దేరి వెళ్లారు. ముందుగా ఆయన లండన్ వెళుతున్నట్లు తెలుస్తోంది.. మరోవైపు విదేశీ పర్యటనకు వెళ్తున్న సీఎం జగన్‌కు గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ విప్‌లు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్, ఎమ్మెల్యే మల్లాది విష్టు, ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డిలు సెండాఫ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 31వ తేదీ రాత్రి తిరిగి విజయవాడకు చేరుకోనున్నారు.
విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీఎం జగన్ నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లండన్ వెళ్లేందుకు బెయిల్ సమయంలో ఉన్న షరతుల్ని సడలించాలని కోరారు. విచారణ జరిపిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి సూచించగా.. జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అయితే కోర్టు విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో శుక్రవారం రాత్రి బయల్దేరి విదేశాలకు వెళ్లారు.. ఎన్నికల కౌంటింగ్‌కు ముందు మళ్లీ రాష్ట్రానికి తిరిగొస్తారు.