తిరుమల శ్రీవారి దర్శనం, సేవలకు సంబంధించి ఓ భక్తుడు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించి మరీ సాధించుకున్నారు. టీటీడీపై పిటిషనద్ దాఖలు చేయగా.. తీర్పును వెల్లడించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన సుమిత్రా శెట్టి, ఆమె కుమారుడు హరీశ్ శెట్టి 2007 ఆగస్టు 21న తిరుమల శ్రీవారి మేల్‌చాట్ వస్త్రం (ఆర్జిత సేవ)లో పాల్గొనేందుకు రూ.12,500 చెల్లించారు. అలాగే హరీశ్‌శెట్టి 2008 డిసెంబర్ 17న తిరుమల శ్రీవారి తిరుప్పావడ సేవ నిమిత్తం రూ.5 వేలు చెల్లించారు.
2021 సెప్టెంబర్ 9న హరీశ్ శెట్టికి , 2021 సెప్టెంబర్ 10న సుమిత్రా శెట్టికి ఈ సేవల్లో పాల్గొనేందుకు టీటీడీ ఖరారు చేసింది. ఆ తర్వాత కరోనా కారణంగా టీటీడీ దర్శనాలు, ఆర్జిత సేవల్ని రద్దు చేసింది. అయితే ఆ తర్వత కూడా సుమిత్రాశెట్టి అదనంగా మరో రూ.3,065 పంపించి సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలని టీటీడీని కోరారు. కానీ అదనంగా పంపించిన డీడీని తిరిగి వారికే టీటీడీ పంపించింది.. సేవలకు వీలు కాదని టీటీడీ వారికి లేఖ రాసింది. దీంతో సుమిత్రాశెట్టి, హరీశ్ శెట్టి టీటీడీకి లీగల్ నోటీసులను పంపించారు.
టీటీడీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వారిద్దరు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఇద్దరి ఫిర్యాదుపై టీటీడీ స్పందించి తమ కేసు కొట్టి వేయాలని కోరారు.. సుమిత్రా శెట్టి, హరీశ్ శెట్టి చెల్లించిన డబ్బు తిరిగి ఇచ్చేస్తామని ఫోరాన్ని అడిగారు. ఈ ఫిర్యాదులపై విచారణ చేసిన ఫోరం కీలక తీర్పును వెల్లడించింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో మేల్‌చాట్ వస్త్రం, తిరుప్పావడ సేవల్లో పాల్గొనే అవకాశం వారిద్దరికి కల్పించాలని వినియోగదారుల ఫోరం ఆదేశించింది. ఒకవేళ కుదరని పక్షంలో రూ.10 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని ఈ మేరకు వినియోగదారుల ఫోరం తీర్పును ఇటీవల వెల్లడించింది. మరి ఈ తీర్పుపై టీటీడీ ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.. వారికి శ్రీవారి సేవల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారా.. లేదంటే అప్పీల్‌కు వెళతారా అన్నది చూడాలి.
తిరుమలలో వైభవంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు ప్రారంభం
తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన మండపంలో శుక్రవారం శ్రీపద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. మే 19వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటిరోజు అంటే వైశాఖశుద్ధ నవమిరోజైన శుక్రవారంనాడు శ్రీమలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయనాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి సాయంత్రం 5.30 గంటలకు వేంచేపు చేశారు.
శోభాయమానంగా తీర్చిదిద్దిన పెండ్లిమండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీస్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవటం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. ఆ తరువాత శ్రీస్వామివారికి కొలువు (ఆస్థానం) జరిగింది. ఈ క్రతువుల అనంతరం చతుర్వేద పారాయణం, మలహారి, దేశిక, సౌరాష్ట్ర, వారహి, కాదన కుతూహల, నీలంబారి రాగాలు, వివిధ తాళాల వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పిదప ఆర్జిత భక్తులకు వస్త్ర బహుమానం, ప్రసాద వితరణ జరిగింది. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామి బంగారుతిరుచ్చిపై అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలిరోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది.
పురాణాల ప్రకారం సుమారు ఐదు వేల ఏళ్ల కిందట, అంటే కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీమహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీవేంకటేశ్వరునికిచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు వైశాఖశుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వేంకటాచల మహాత్మ్యం గ్రంథం తెలుపుతోంది.
ఆనాటి పద్మావతీ శ్రీనివాసుల కల్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమినాటికి ముందు ఒక రోజు, తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడురోజుల పాటు పద్మావతీ పరిణయోత్సవాన్ని టిటిడి నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. ఆనాటి నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతీ పరిణయ వేడుకలు జరగడం విశేషం.