ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్లే సమయంలో కలకలంరేగింది. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని గుంటూరు జిల్లా వెంకటాయపాలెంకు చెందిన ఎన్ఆర్‌ఐ డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్‌గా గుర్తించారు. విమానాశ్రయంలోని వాహనాల పార్కింగ్ ప్రదేశంలో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
లోకేష్‌ను పోలీసులు ప్రశ్నించగా.. గుండెపోటు వచ్చినట్లు లోకేష్ చెప్పారు. ఆయన అక్కడే పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయతే ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనపై డాక్టర్ల లోకేష్ మెసేజ్‌లు పంపినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలోనే ఇలా జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. లోకేష్ కోలుకోగానే పోలీసులు ప్రశ్నించనున్నారు.
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్న డాక్టర్ లోకేష్ కుమార్‌కు అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉంటున్నట్లు గుర్తించారు.. ఆయన డాక్టర్‌గా సేవలు అందించి రిటైర్ అయ్యారట. అలాగే లోకేష్‌కు అమెరికన్ పౌరసత్వం ఉన్నట్లు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించిన కొన్ని మెసేజ్‌లను కొందరికి పంపినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు డాక్టర్ లోకేష్ కుమార్‌కు సంబంధం ఏంటి.. జగన్ లండన్ వెళ్లే సమయంలో ఎందుకు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు..? ఏపీ సీఎం విదేశీ పర్యటనకు సంబంధించిన మెసేజ్‌లను ఎవరికి పెట్టాడు..? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
మరోవైపు లోకేష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తనను జగన్ పోలీసులు కిడ్నాప్ చేసి, కొట్టి, బెదిరించి ఏదో ఒప్పుకోమని లేకపోతే.. ఏదైనా చేయగలమని ఒక 20మంది పోలీసులు వచ్చారన్నారు. అక్కడికి వచ్చిన పోలీసులకు బాడ్జ్‌లు, పేర్లు లేవన్నారు. తన అమెరికా ఐఫోన్ తీసుకుని తన మెసేజ్‌లు, వాట్సాప్ మెసేజ్‌లు చదివారని, మెయిల్స్‌లో ఫోటోలు తీసుకున్నట్లు ఆరోపించారు.