రైల్లో దోపిడీకి ప్రయత్నించిన దొంగలకు ప్రయాణికులు ఝలక్ ఇచ్చారు. ఓ దోపిడీ ముఠా అటవీ సిగ్నల్ లైట్లకు బురదపూసి రెండు రైళ్లను నిలిచిపోయేలా చేశారు. అనంతరం రైళ్లలోకి ప్రవేశించి ప్రయాణికుల వద్ద నగదు, నగలు దోచుకునేందుకు ప్రయత్నించారు. కానీ, దొంగల ప్లాన్‌ను ప్రయాణికులు తిప్పికొట్టారు. ముఠాపై తిరగబడటంతో పలాయనం చిత్తగించారు. విస్తుగొలిపే ఈ ఘటన ఉత్తరాఖండ్లోని లక్సర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.
మొరాదాబాద్-సహారన్‌పుర్ రైల్వే డివిజన్ పరిధిలోని లక్సర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు సిగ్నల్ కనిపించకుండా కొందరు దుండగులు లైట్లకు బురద రాశారు. దీంతో సిగ్నల్ ఇవ్వలేదని భావించిన ఆ మార్గంలో వస్తున్న పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్, గోరఖ్ పుర్- చండీగఢ్ ప్రత్యేక రైళ్లు నిలిచిపోయాయి. ఈ సమయంలో కొందరు రైళ్లలోకి ఎక్కి దోపీడికి యత్నించి విఫలమయ్యారు. ప్రయాణికులు వారిని ప్రతిఘటించి, ఎదురు తిరగడంతో అక్కడి నుంచి పరారయ్యారు. అంతేకాదు, వారి ప్లాన్ ఫలించలేదన్న అసహనంతో రైళ్లు రువ్వారు.
ఇదే సమయంలో కంట్రోల్ రూమ్‌కి లోకో పైలట్ సమాచారం అందించడంతో అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. లక్సర్ ఆర్పీఎఫ్ ఇంఛార్జ్ ఎస్ఐ రవి శివాచ్, జీర్పీ స్టేషన్ హెడ్ సంజయ్ శర్మ, ఎస్పీ సరితా దోవల్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్ రైలు నిర్దేశిత సమయం కంటే ఆలస్యంగా నడుస్తోంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత రూర్కీ స్టేషన్ నుంచి బయలుదేరి... శుక్రవారం మధ్యాహ్నానికి లక్సర్ స్టేషన్కు చేరింది. అప్పటికే దుండగులు లైట్లపై బురద పూయడం వల్ల సిగ్నల్ కనిపించక లోకో పైలట్ రైలును నిలిపేశారు. దాని వెనుకనే వస్తున్న గోరఖ్‌పూర్- చండీగఢ్ ఎక్స్ప్రెస్ను ఆగిపోయింది. ప్రయాణికుల నుంచి దోపిడీ, రాళ్ల దాడిపై తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఇన్‌స్పెక్టర్ రవి శివాచ్ తెలిపారు. రైలును నిలిచిపోయేలా కుట్రచేసిన గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు.