ఆంధ్రప్రదేశ్‌లో మరో కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య నంద్యాల, ఆత్మకూరు, కొల్లాపూర్, నాగర్‌కర్నూలు, కల్వకుర్తి మాగర్గంలో సోమశిల దగ్గర మరో వంతెన ఇప్పటికే ప్లాన్ చేశారు. కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టగా.. తాజాగా మరో బ్రిడ్జికి ప్రతిపాదనలు వచ్చాయి. ఆ బ్రిడ్జి కూడా ఏపీ-తెలంగాణ సరిహద్దులోని కృష్ణా నదిపైనే నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ స్పిల్‌వేకు సమాంతరంగా ఇప్పుడు ఉన్న పాత వంతెన స్థానంలో.. కొత్తగా కేబుల్ బ్రిడ్జి నిర్మించాలని కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేబుల్ బ్రిడ్జికి సంబంధించి డీపీఆర్ సిద్ధమవుతోంది.
జాతీయ రహదారి-765 గుంటూరు నుంచి కర్నూలు వెళ్లే రోడ్డులో కుంట జంక్షన్ నుంచి దోర్నాల, శ్రీశైలం క్రాస్‌రోడ్, సున్నిపెంట, దోమలపెంట మీదుగా హైదరాబాద్‌కు విస్తరిస్తున్నారు. ఈ హైవే నల్లమల అటవీ ప్రాంతం పరిధిలో కొంతదూరం మాత్రమే ఉంది. దోర్నాల-కుంట మధ్య 24 కిలో మీటర్ల వరకు రూ.245 కోట్లతో విస్తరణ పనులు చేపట్టారు. అలాగే దోర్నాల నుంచి శ్రీశైలం క్రాస్ రోడ్, సున్నిపెంట మీదగా కృష్ణానదిపై వంతెన దాటే వరకు 53.5 కి.మీ మేర విస్తరణకు డీపీఆర్‌న కేంద్రం తయారు చేస్తోంది.
1972లో ప్రస్తుతం ఉన్న వంతెనను నిర్మించగా.. ఆ సమీపంలోనే ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ బ్రిడ్జికి రూ.వెయ్యి కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారుల అంచనా. దోర్నాల-శ్రీశైలం మార్గంలో.. ఇటు శ్రీశైలం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో సున్నిపెంట దాటాక చాలా మలుపులు ఉన్నాయి. వీటిని తగ్గించేందుకు సున్నిపెంట దగ్గర బైపాస్ నిర్మాణం చేపట్టి.. కొత్తగా నిర్మించే కేబుల్ బ్రిడ్జిపైకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రధానంగా మలుపులు తగ్గించేలా అలైన్‌మెంట్‌లో మార్పులు చేయనున్నారు.
ఈ అలైన్‌మెంట్ మార్పులతో కొన్ని చోట్ల అటవీ ప్రాంతంలోకి రోడ్డు వెళుతుంది. అందుకే వన్యప్రాణులకు ఇబ్బంది ఉంటుందని అటవీశాఖ వన్యప్రాణి సంరక్షణ విభాగం చెబుతోంది. అటవీ భూమిని ఎక్కువ తీసుకోకుండా.. ప్రస్తుతం ఉన్న రోడ్డునే విస్తరించేలా చూడాలని కోరుతోంది. కేంద్రం మాత్రం రాబోయే రోజుల్లో వాహనాల రద్దీ, భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అలైన్‌మెంట్ మార్చాలని భావిస్తోందంటున్నారు అధికారులు. డీపీఆర్ పూర్తిగానే వచ్చే ఏడాదిలోపు పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి మరో కేబుల్ బ్రిడ్జి శ్రీశైలం దగ్గర ఏర్పాటుకానుంది. శ్రీశైలంకు ప్రతి రోజూ వేలాదిమంది భక్తులు తరలి వెళుతుంటారు.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే హైవేలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా అవసరమైన చోట్ల హైవేను మరింతగా విస్తరిస్తోంది.