గుంటూరులో ప్రభుత్వ అధికారి ఇంటిపై పెట్రోల్ సీసాతో దాడి ఘటన కలకలంరేపింది. రాష్ట్ర ఉపాధి కల్పనశాఖ జేడీ ఇంటిపై గుర్తుతెలియని దుండగులు పెట్రోలు సీసాతో దాడిచేశారు. డి చైతన్య రాష్ట్ర ఉపాధికల్పనశాఖ కార్యాలయంలో జాయింట్ డైరెక్టగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన గుంటూరు ఆకులవారితోటలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం వేకువజామున మూడు గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ సీసాకు నిప్పు పెట్టి చైతన్య ఇంటిపై విసిరారు. చైతన్య కుటుంబం నిద్రలో ఉన్నారు..ఆ సీసా పగిలిన శబ్దం రావడంతో నిద్రలేచారు. ఒక్కసారిగా మంటలు రావడం చూసి షాకయ్యారు.
వెంటనే అక్కడికి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆ ఇంటి కిటికీలు, కరెంట్ స్విచ్‌బోర్డు, దుస్తులు, ప్లాస్టిక్ బకెట్‌లు పూర్తిగా కాలిపోయాయి. వారు వెంటనే అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పిపోయింది. చైతన్య వెంటనే డయల్ 11కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.. వెంటనే నగరంపాలెం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అది పెట్రోల్ బాంబ్ కాదని.. దుండుగులు పెట్రోల్ సీసాలో పోసి నిప్పంటించినట్లు గుర్తించినట్లు పోలీసులు గుర్తించారు.
ఇదిలా ఉంటే.. ప్రభుత్వ అధికారి చైతన్య ఇంటి ముందు నిలిపి ఉన్న కారును అదే ఏరియాకు చెందిన యువకుడు తన బైక్‌తో ఢీకొట్టాడు. కారు దెబ్బతినడంతో రిపేర్ చేయించాలని ఆయన ఆ యువకుడ్ని కోరాడు.. ఆ యువకుడు బైక్ అక్కడే వదిలేసి.. కారు మరమ్మతులకు డబ్బులు ఇచ్చి తీసుకెళతానని చెప్పాడు. ఈలోపే ఈ దాడి జరగడంతో కలకలంరేపింది.. ఆ యువకుడిపై అనుమానం వ్యక్తం చేశారు చైతన్య. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.