పశ్చిమాసియా రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంతంతో ఆ దేశం ఇప్పుడు పెను సంక్షోభంలో చిక్కుకుంది. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఖమేనీ మరణించినట్లు అధికారికంగా ధృవీకరించిన ఇరాన్.. ఇప్పుడు ప్రతీకారేచ్ఛతో దాడులు చేస్తోంది. దీనికి సంకేతంగానే పవిత్ర నగరమైన కోమ్‌లోని జమ్‌కరన్ మసీదుపై ఎర్ర జెండాను ఎగురవేసింది. ఇలా ఎర్ర జెండా ఎగుర వేయడం వెనుక అర్థమేంటి, దాని కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఎర్ర జెండా వెనుక అర్థమిదే..
సాధారణంగా ఇరాన్ సంప్రదాయంలో మసీదు గోపురంపై ఎర్ర జెండాను ఎగురవేయడం అంటే.. అన్యాయానికి గురయ్యామని అర్థం. అంతేకాకుండా ప్రతీకారం తీర్చుకునే వరకు విశ్రమించబోమని సంకేతం. అలీ ఖమేనీ మరణం తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలోనే మెరుపు దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని, ఖమేనీ మరణానికి కారణమైన హంతకులను వదిలిపెట్టబోమని ఇరాన్ అత్యున్నత దళం రివల్యూషనరీ గార్డ్స్ ప్రతిజ్ఞ చేసింది. మరోవైపు ఖమేనీ మద్దతుదారులు న్యాయం జరగాలి అంటూ వీధుల్లోకి వస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఇంకొందరు టెహ్రాన్ వీధుల్లో బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకోవడం గమనార్హం.
వారసుడి వేటలో అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్..
ఖమేనీ మరణంతో ఇరాన్ పాలనలో ఏర్పడిన శూన్యతను భర్తీ చేసేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే వరకు దేశాన్ని నడిపించడానికి ముగ్గురు సభ్యుల తాత్కాలిక నాయకత్వ మండలిని ఏర్పాటు చేశారు. 66 ఏళ్ల వయసు కల్గిన మతగురువు అలీరెజా అరాఫీను జూరిస్ట్ సభ్యుడిగా నియమించారు. మసూద్ పెజెష్కియాన్‌ను ఇరాన్ అధ్యక్షుడిగా, గోలమ్ హొస్సేన్ మొహ్సేని ఎజీ చీఫ్ జస్టిస్‌గా పెట్టారు. ఈ మండలి ప్రస్తుతానికి సుప్రీం లీడర్ విధులను నిర్వహిస్తుంది. త్వరలోనే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ సమావేశమై శాశ్వత వారసుడిని ఎంపిక చేయనుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ.. "చరిత్రలోనే అత్యంత క్రూరమైన వ్యక్తులలో ఒకడైన ఖమేనీ అంతమయ్యాడు. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన సమయం" అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ఇరాన్ ప్రజలు విప్లవం ద్వారా తమ భవిష్యత్తును సురక్షితం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఇజ్రాయెల్ రక్షణ దళం.. ఖమేనీని ఇరాన్ ఆక్టోపస్‌కు తల వంటివాడని, మధ్యప్రాచ్యంలో వినాశనానికి అతడే రూపశిల్పి అని అభివర్ణించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa