ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వేళ రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

national |  Suryaa Desk  | Published : Mon, Mar 02, 2026, 07:20 PM

ఇరాన్ , ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలతో పశ్చిమాసియా అట్టడుకుతోంది. శనివారం నాడు ఇజ్రాయెల్-ఇరాన్ సంయుక్త దాడులు చేపట్టగా.. దీనికి ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. అమెరికా దాడుల్లో ఇరాన్‌ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణంపై షియా వర్గాలు భగ్గుమంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భారీ ప్రదర్శనలు, నిరసనలు, హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. ఇక, భారత్‌లోని జమ్మూ కశ్మీర్, యూపీ, కర్ణాటక, న్యూఢిల్లీ సహా పలుచోట్ల పెద్ద ఎత్తున ముస్లింలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలోనూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.


దేశంలో హింసాత్మక ఘర్షణలు జరగకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు కోరింది. ఇరాన్ అనుకూల, వ్యతిరేక ఆందోళనలపై రాష్ట్రాలు దృష్టి కేంద్రీకరించాలని సూచించింది. అమెరికా, దాని మిత్రదేశాల ఎంబసీలు, కాన్సులెట్లు, పర్యాటక కేంద్రాలను ఇరాన్ మద్దతుదారులు టార్గెట్ చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ‘‘రెచ్చగొట్టే ప్రసంగాలు, హింసాత్మక చర్యలను రెచ్చగొట్టే ఇరాన్ అనుకూల ర్యాడికల్స్‌ను గుర్తించాలి.. ‘‘ఇరాన్ అనుకూల తీవ్రవాదులు, ప్రపంచ ఉగ్రవాద గ్రూపులు (GTG) సోషల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షించాలి.. ఇరాన్ అనుకూల విద్యార్థి సంస్థలు, సామాజిక-రాజకీయ సంస్థలపై నిఘా పెంచాలి’’ అని రాష్ట్రాలకు సూచించింది.


  షియా మిలీషియా గ్రూప్‌లతో పాటు ఐఎస్, అల్-ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు ఇండియాలోని అమెరికా, ఇజ్రాయెల్ ఎంబసీలు, కాన్సులేట్లు, వారి సిబ్బంది, ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, వ్యాపార సంస్థలు, పర్యాటక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ముప్పు గురించి ముఖ్యంగా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌ల చుట్టూ భద్రతా సిబ్బందికి అవగాహన కల్పించాలని, ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ పర్యటకులు తరచుగా సందర్శించే పర్యాటక ప్రదేశాలలో భద్రతను పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్రాలను కోరింది. ఆ ప్రాంతాల్లో ఐఈడీలు, పేలుడు పదార్థాలపై తనిఖీలు, సీసీటీవీలు ఏర్పాటు చేయాలని సూచించింది.


ఖమేనీ హత్యను ఖండిస్తూ సోమవారం కూడా కశ్మీర్ లోయలో నిరసనలు కొనసాగాయి. దీంతో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. షియాలు అత్యధికంగా ఉండే లాల్ చౌక్, సాయిద కాటల్, బడ్గాం, బందిపొర, అనంత్‌నాగ్, పుల్వామా ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa