కర్నూలు నగర శివారులోని పంచలింగాలలో ఉన్న జిల్లా జైలును కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎన్.శ్రీనివాసరావు శనివారం తనిఖీ చేశారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఆయన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రితో కలిసి ఆయన ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆయన కారాగారానికి సంబంధించిన రికార్డులను పరిశీలించి ఖైదీలకు అందిస్తున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన ఖైదీలతో మాట్లాడుతూ ఉచిత న్యాయ సహాయం అవసరమైన వారికి న్యాయ సహాయాన్ని ఉచితంగా అందజేస్తామన్నారు. అవసరమైన ఖైదీలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. ఖైదీలు సత్ప్రవర్తనను అలవర్చుకుని సమాజంలో మంచి పౌరులుగా మెలగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ ఘనే నాయక్, చీఫ్ లీగల్ ఎయిర్ డిఫెన్స్ కౌన్సిల్ మనోహర్, తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత వారు నగరంలోని మహిళా జైలును తనిఖీ చేశారు. మహిళా జైలులో మహిళలకు కల్పించిన భద్రత, వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.