ఆలూరు సబ్ డివిజనల్ విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేంద్ర ప్రసాద్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆలూరు నియోజకవర్గంలోని హొళగుంద మండలం హెబ్బటం గ్రామంలో ఓ రైతు పొలంలో అనుమతులు లేకుండానే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడంపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో 15 రోజుల క్రితం విద్యుత్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉమాపతి నేరుగా గ్రామానికి వచ్చి విచారణ చేపట్టారు. అనుమతులు లేకుండా నాగభూషణం రెడ్డి పొలంలో వేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి వాటిని తీసుకెళ్ళారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, డీఈఈ నాగేంద్ర ప్రసాద్‌ను సస్పెండ్ చేసినట్లు ఎస్‌ఈ ఉమాపతి వెల్లడించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ రోజు, హాలహర్వి మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినా కూడా డీఈఈ పట్టించుకోలేదు. సస్పెన్షన్ వ్యవహారంలో ఈ అంశాన్ని కూడా ఉన్నతాధికారులు పరిగణలోకి తీసుకున్నారు.