ఒక మాదిరిగా చదువుకున్నా పర్వాలేదు. విదేశాల్లో పెద్ద ఉద్యోగం. రూ.లక్షల్లో సంపాదన. ఏసీ రూముల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ పనిచేయాల్సి ఉంటుంది’ అని చెప్పి నిరుద్యోగ యువతను నమ్మించి విదేశీ ముఠాలకు విక్రయిస్తున్న ముగ్గురు సభ్యులను నగర పోలీసులు అరెస్టు చేశారు. ఆ ముఠా చేతిలో చిక్కిన ఓ యువకుడు ఇటీవల బయటపడ్డాడు. అతను ఇచ్చిన సమాచారంతో నిందితులను నగర పోలీసులు అరెస్టు చేయగలిగారు. ఇందుకు సంబంధించి శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్‌అయ్యన్నార్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖలోని గాజువాక ప్రాంతానికి చెందిన చుక్కా రాజేష్ (33) ఇంజనీరింగ్ చదువుకున్నాడు. 2013 నుంచి 2019 వరకూ గల్ఫ్‌లో ఫైర్ సేఫ్టీ మేనేజర్‌గా పనిచేశాడు. తర్వాత గాజువాకలోనే ఒక కన్సల్టెన్సీని ప్రారంభించి గల్ఫ్ దేశాలకు ఫైర్ సేఫ్టీలో పనిచేసేందుకు మనుషులను పంపించడం మొదలెట్టాడు. 2023 మార్చిలో సంతోష్ అనే వ్యక్తి రాజేష్‌కు ఫోన్ చేసి తాను కాంబోడియా నుంచి మాట్లాడుతున్నానని, తనకు డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేసేందుకు కంప్యూటర్ నాలెడ్జ్‌తోపాటు ఇంగ్లీష్ మాట్లాడగలిగే 30 మంది కావాలని కోరాడు. విమానం టికెట్లు, వీసా, కాంబోడియాలో వసతి సదుపాయం వంటివి తానే చూసుకుంటానని, ఒక్కొక్కరి నుంచి రూ.90 వేలు వసూలుచేసి అందులో రూ.20 వేలు కమీషన్ కింద తీసుకోవాలని ఆఫర్ ఇచ్చాడు. కాంబోడియా నుంచి జాబ్ స్కామ్‌లు, టాస్క్‌గేమ్ వంటి సైబర్ ఫ్రాడ్స్ చేసే పని వారికి అప్పగిస్తామని రాజేష్‌కు చెప్పాడు. అయితే తక్కువ కాలంలోనే భారీగా సంపాదించే అవకాశం దొరికిందని భావించిన రాజేష్ విశాఖతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతను కాంబోడియాలో ఉద్యోగాలంటూ ఆకర్షించి తొలుత 27 మందిని మూడు దఫాలుగా అక్కడకు పంపించాడు. తర్వాత ఆర్య అనే మహిళ రాజేష్‌ను పరిచయం చేసుకుని సంతోష్ కంటే ఎక్కువ కమీషన్ ఇస్తామని చెప్పింది. ఆమెతోపాటు ఉమామహేష్, హబీబ్ అనే ఏజెంట్లు కూడా పరిచయం అయ్యారు. వీరందరి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా తనను సంప్రతించిన 150 మంది నిరుద్యోగులను రాజేష్ విజిటింగ్ వీసాపై బ్యాంకాక్...అక్కడ నుంచి కాంబోడియా పంపించాడు. అక్కడకు వెళ్లిన తర్వాత ఒక్కొక్కరిని చైనా కంపెనీలకు ఏజెంట్లు 2,500 డాలర్లు నుంచి నాలుగు వేల డాలర్లు చొప్పున విక్రయించారు. ఇలా గత రెండేళ్లలో ఏపీ, తెలంగాణాతోపాటు దేశవ్యాప్తంగా ఐదు వేల మంది పలువురు ఏజెంట్ల ద్వారా కాంబోడియా చేరినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. వీరందరినీ చైనా ముఠాలు కొనుక్కొని వారికి సైబర్ నేరాలపై శిక్షణ ఇచ్చి భారతీయులకు ఫోన్‌లు చేయించి మోసాలకు పాల్పడేలా చేస్తున్నాయి. ఎవరైనా ఆ పని చేయబోమంటే చీకటి గదుల్లో పెట్టి చిత్రహింసలకు గురిచేసేవి. ఇలా ఈ ఏడాదిన్నరలో భారతీయుల నుంచి వందల కోట్లు దోచుకున్నాయి. కాగా, కాంబోడియాలో చైనా ముఠా చేతిలో చిక్కుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ అక్కడి నుంచి తప్పించుకుని నగరానికి చేరుకుని 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి సమాచారం అందజేశారు. దీనిపై సీపీ రవిశంకర్ అయ్యన్నార్ ఆదేశాల మేరకు సైబర్‌క్రైమ్ సీఐ కె.భవానీప్రసాద్ లోతుగా దర్యాప్తు చేసి ఉద్యోగాల పేరుతో మానవ అక్రమ రవాణాకు సహకరిస్తున్న గాజువాక ప్రాంతానికి చెందిన చుక్కా రాజేష్‌తోపాటు అతని వద్ద పనిచేస్తున్న సబ్బవరపు కొండలరావు, మన్నేన జ్ఞానేశ్వర్‌లను అరెస్టు చేశారు. కాంబోడియాలో చిక్కుకున్న వారిని విడిపించేందుకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిత్వశాఖతో సంప్రతింపులు జరుపుతామని సీపీ తెలిపారు. ఈ సమావేశంలో ఏడీసీపీ ఎం.శ్రీనివాసరావు, సైబర్‌క్రైమ్ సీఐ భవానీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.