పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో పోలీసు అధికారుల పాత్ర, విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై సిట్ కూపీ లాగుతోంది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరించిన అధికారుల తీరుపై విచారిస్తోంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శనివారం క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగింది. ఇంటెలిజెన్స్ ఐజీ వినీత్ బ్రిజిలాల్ నేతృత్వంలో 13మంది అధికారులతో ఏర్పాటైన సిట్ నాలుగు బృందాలుగా విడిపోయి ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తోంది. పల్నాడు జిల్లా మాచర్ల, నరసరావుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రితోపాటు తిరుపతిలో సిట్ అధికారులు పర్యటిస్తున్నారు. అధికార పార్టీకి వంతపాడిన దిగువ, మధ్యస్థాయి పోలీసు అధికారుల పాత్రపై విచారణ చేస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నా, ఆస్తులను ధ్వంసం చేస్తున్నా ఆపకుండా ప్రేక్షకపాత్ర పోషించిన అధికారులు ఎవరు? ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకుండా అధికార పార్టీ నేతలకు సమాచారం చేరవేసిన పోలీసులెవరు? అన్న కోణాల్లో విచారిస్తున్నారు. ‘సీడీ ఫైల్ తీసుకురండి. ఎఫ్‌ఐఆర్‌లో ఏయే సెక్షన్లు వేశారు? ఎవరెవరిని అరెస్టులు చేశారు? వచ్చిన ఫిర్యాదులేంటి? దర్యాప్తులో లభించిన ఆధారాలేంటి?’ అంటూ సిట్ అధికారులు.. స్థానిక పోలీసులను ప్రశ్నిస్తున్నారు.