ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య సంచలనం సృష్టించింది. శాసనసభ ఎన్నికలలో పోలింగ్ పూర్తి అయిన రెండు రోజులకు ఆయన ఐ-ప్యాక్ సంస్థలో పనిచేసేవారితో సమావేశమై ఫలితాలపై తనదైన శైలిలో జోస్యం చెప్పారు. 2019లో వైయస్ఆర్‌సీపీకు వచ్చిన 151 సీట్లను మించే ఈసారి కూడా సీట్లు వస్తాయని ప్రకటించారు. ఇంత ధైర్యంగా జగన్ ఎలా చెప్పారు? ఆయన వద్ద ఉన్న సమాచారం ఏమిటి? ఇంతవరకు జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా సాహసోపేతమైన రీతిలో ఆయన తన అంచనాలు వెల్లడించడంలో ఉద్దేశం ఏమిటి అన్నదానిపై చర్చలు సాగుతున్నాయి. జగన్ చెప్పినట్లు ఆ స్థాయిలో విజయం సాధ్యమేనా అన్న సంశయం పలువురిలో ఉంది. అయినా గత అనుభవాల రీత్యా ఏమోలే వస్తే రావచ్చు అని అనుకున్నవారూ ఉన్నారు. జగన్ ధైర్యానికి ఒకటే కారణం స్పష్టంగా కనిపిస్తుంది. తాను ఇచ్చిన పేదలు vs పెత్తందార్లు అన్న నినాదం ఫలించిందని ఆయన భావిస్తున్నారు. అంతేకాదు.. మీ ఇంట్లో తన ప్రభుత్వం వల్ల మంచి జరిగిందని అనుకుంటేనే ఓటు వేయండని పిలుపు ఇచ్చారు. అది కూడా బాగా పని చేసి ఉండవచ్చు. ఎందుకంటే జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల కనీసం మూడు కోట్ల మందికి పైగా లబ్ది పొందారు. వారిలో ఏభై, అరవై శాతం ఓట్లు వేసినా, తాను అనుకున్న సీట్లు రావడం కష్టం కాదు.