సిట్ బృందం తిరుపతి జిల్లాలో ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. రాత్రికే ప్రాథమిక నివేదికను సిట్ సారథి ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌కు సమర్పించినట్లు తెలిసింది. సిట్ సభ్యులైన ఏసీబీ డీఎస్పీ కె.రవిమనోహరాచారి, సీఐ ప్రభాకర్ శనివారం రాత్రి 10.30కు తిరుపతి చేరుకున్నారు. ఆలోపే వివిధ మార్గాల్లో చాలామటుకు సమాచారం సేకరించారు. ఆదివారం ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించారు. తొలుత తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. పోలింగ్ మర్నాడు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం, అలిపిరి సీఐ రామచంద్రారెడ్డి వాహనం ధ్వంసం వంటి ఘటనలకు సంబంధించిన కేసుల ఎఫ్‌ఐఆర్‌లు పరిశీలించారు. ఆ స్టేషన్ సీఐ మురళీమోహన్ నుంచీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రదేశాలనూ పరిశీలించారు. తర్వాత చంద్రగిరి మండలం కూచివారిపల్లి వెళ్లి పోలింగ్ రోజు రాత్రి హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలను చూశారు. టీడీపీ వర్గీయులు తగులబెట్టిన వైసీపీ సర్పంచ్ కొటాల చంద్రశేఖర్‌రెడ్డి ఇంటిని, కారును పరిశీలించారు. గ్రామంలోని శ్రీకృష్ణ మందిరం వద్ద గ్రామస్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.