వ్యవసాయమంటే కష్టాలు కడగండ్లే. సేద్యం చేసి లాభపడిన వాళ్లెవరూ లేరని రైతులు అంటారు. రెండేళ్లుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో అతివృష్ఠి, అనావృష్ఠితో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరో పది రోజుల్లో ఖరీఫ్ సీజన్ మొదలు కానుంది. ఎప్పటిలాగే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? లేక అండగా ఉంటారా? అని రైతులు ఎదురు చూస్తున్నారు. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడిని రైతులకు అందించేందుకు ఏటా కలెక్టర్ ఆధ్వర్యంలో రుణ ప్రణాళికలను ఈపాటికే సిద్ధం చేసేవారు. అయితే.. ఈసారి సాధారణ ఎన్నికల నేపథ్యంలో రుణ ప్రణాళికను తయారు చేయడం ఆలస్యమైందని కర్నూలు జిల్లా వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి తెలిపారు. త్వరలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పంట సాగు కోసం ఎంత రుణం ఇచ్చేది కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. జిల్లాలో ప్రతి ఏటా వర్షాలు ఎప్పుడు వచ్చేదీ సందేహాస్పదంగా ఉండేది. అయితే గతంలా కాకుండా ఈసారి ఖరీఫ్ సాగుకు అనుకూలంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికార వర్గాలు తెలపడంతో రైతులు ఊరట చెందుతున్నారు. తమకు పంట రుణాలను సకాలంలో అందించడంతో పాటు కల్తీ, నాసిరకం విత్తనాల బెడద నుంచి కాపాడాలని వ్యవసాయ యంత్ర పరికరాలు ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకోవాలని, అదే విధంగా ముఖ్యమైన ఎరువులు యూరియా, డీఏపీ తదితర వాటిని ఆర్‌బీకేల ద్వారా అందించాలని అధికారులను కోరుతున్నారు.