వినుకొండ పట్టణంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. నిన్నమొన్నటి వరకు వేడిమి తాకిడికి వడగాల్పులతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు ఆదివారం సాయంత్రం కురిసిన వర్షం కొంత వేసవితామానికి ఉపశమనం లభించింది. సుమారు గంటసేపు ఈదురు గాలులతో కూడిన వర్షం తాకిడికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పట్టణంలోని ప్రధాన రహదారుల పొడవునా ఉన్న డ్రెయినేజీ కాలువలు పొంగి రోడ్లపై ప్రవహించాయి. వర్షపునీరు తాకిడికి వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం మొత్తంవర్షం నీటితో చెరువును తలపించింది. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో వర్షపునీరు ప్రవహించే మార్గం లేకపోవడంతో నీరంతా పాఠశాల ఆవరణలోకి చేరింది. ఇదిలా ఉండగా ఈదురు గాలుల తాకిడికి విజయలక్ష్మి సీడ్స్ పక్కన బిల్డింగ్‌పై ఏర్పాటుచేసిన హోర్డింగ్‌లు నేలకొరిగాయి. హోర్డింగ్‌లు నిర్మించిన దిమ్మెలు ఒక్కసారిగా పైకిలేచి హోర్డింగ్ ఇనుప బోర్డు పక్కనే ఉన్న మూడు ట్రాన్స్‌ఫార్మర్లపై పడింది. ఆదివారం కావడం పెనుప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ ను నిలుపుదల చేసి సంఘటనా ప్రాంతానికిచేరుకొని ప్రొక్లయిన్ సాయంతో ట్రాన్స్‌ఫార్మర్ల కరెంటు దిమ్మెలకు ఆనుకుని ఉన్న హోర్డింగ్ బోర్డును తొలగించారు. ఇదిలా ఉండగా ఎన్‌ఎ్‌సపీ కాలనీలోని లలితాంబిక దేవాలయం ఎదురుగా ఉన్న చెట్టు కొమ్మలు విరిగి విద్యుత్‌వైర్లపై పడింది. దీంతో ఇందిరానగర్ సచివాలయం వరకు ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు ఒక్కసారిగా నేలకొరిగాయి. ఆ ప్రాంతంలో జనసంచారం లేకపోవడంతో పెనుప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. పట్టణంలోని తారకరామనగర్‌లో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. నరసరావుపేట ప్రధాన రహదారిపై ఇరువైపులా చిరువ్యాపారులు ఏర్పాటుచేసిన పాకలు సైతం నేలకొరిగాయి. దీంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వినుకొండ మున్సిపాలిటీలో గత ఏడాది నుంచి కాలువల్లో పూడికతీత లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి సైతం మురుగునీరు రోడ్లపై ప్రవహించడంతో స్థానికులు తీవ్ర అసహనానికి గురయ్యారు.