కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్ల వద్ద సోమవారం మధ్యాహ్నం రెండు చిరుతలు కనిపించాయి, దీంతో నడకదారి భక్తులు ఆందోళన చెందారు. భయంతో బిగ్గరగా కేకలు పెట్టారు. భక్తుల కేకలతో బెదిరిపోయిన చిరుతలు.. అక్కడి నుంచి అడవిలోకి పారిపోయాయి. మెట్లమార్గంలో చిరుతలు కనిపించడంతో భక్తులు హడలిపోయారు. వెంటనే టీటీడీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. టీటీడీ సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని విజిలెన్స్ సిబ్బందికి తెలియజేశారు.
ఈ నేపథ్యంలో విజిలెన్స్ సిబ్బంది వెంటనే.. ఘటనాస్థలానికి చేరుకున్నారు. చిరుతల సంచారం గురించి ఫారెస్ట్ అధికారులకు తెలియజేశారు. దీంతో చిరుతల జాడను గుర్తించేందుకు ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగారు. మరోవైపు చిరుతల సంచారంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. నడకదారి గుండా భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు. క్యూలైన్లలో ఒంటరిగా వెళ్లవద్దని.. గుంపులుగా వెళ్లాలంటూ భక్తులకు కీలక సూచనలు చేస్తున్నారు.
మరోవైపు ఐదారు రోజుల కిందట కూడా తిరుమల కొండపై చిరుత సంచారం కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో వాహనాదారులకు చిరుత కనిపించింది. భక్తులు కారులో వెళ్తున్న సమయంలో.. తెల్లవారుజామను చిరుత వారు ప్రయాణిస్తున్న కారుకు అడ్డొచ్చింది. దీంతో కంగారుపడిపోయిన భక్తులు.. చిరుత రోడ్డు దాటుకుని వెళ్లిపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఒకేసారి రెండు చిరుతలు.. అలిపిరి నడకమార్గంలో ప్రత్యక్షం కావటం భక్తులను భయపెడుతోంది.
గతేడాది కూడా అలిపిరి నడకమార్గంలోనే చిన్నారి లక్షితపై చిరుత దాడిచేసి పొట్టనబెట్టుకుంది. ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఆ తర్వాత చిరుతల కోసం ఫారెస్ట్ సిబ్బంది ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. బోనులు, సీసీటీవీ కెమెరాల ద్వారా వాటిని బంధించి.. దూరంగా ఉన్న అడవుల్లో వదిలిపెట్టారు. కానీ మళ్లీ ఇప్పుడు చిరుత సంచారం భయపెడుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల కొండకు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఎక్కువమంది అలిపిరి నడకమార్గం గుండా నడిచి వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే నడకమార్గంలో చిరుతలు కనిపించడం భక్తుల్లో ఆందోళన పెంచుతోంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.