కర్ణాటక రాజధాని బెంగళూరు నగర శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోన్న రేవ్ పార్టీపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ పార్టీని హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. కర్ణాటక సీసీబీ పోలీసుల బృందం ఈ పార్టీని భగ్నం చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరిలో పలువురు టీవీ నటీనటులు, మోడళ్లు ఉన్నట్టు నిర్ధారించారు. అదుపులోకి తీసుకున్నవారిలో 25 మంది అమ్మాయిలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి తన పుట్టిన రోజు వేడుకలను బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఏర్పాటు చేశారు. జీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున మందుతో పాటు డ్రగ్స్ అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పేరుతో ఈ ఫామ్‌హౌస్ ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. రేవ్ పార్టీలో డ్రగ్స్, కోకైన్ లభ్యమయ్యాయి. అలాగే, ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు కూడా ఉండటం గమనార్ం. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలిలో 17 గ్రాముల ఎండీఎంఏ, కొకైన్‌తో పాటు మెర్సిడెస్ బెంజ్, ఆడి, జాగ్వార్ సహా 15 ఖరీదైన కార్లు, పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ పార్టీలో 30 మంది అమ్మాయిలు, 70 మంది యువకులు పాల్గొన్నారు. వీరంతా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విమానంలో తరలివెళ్లినట్టు తెలుస్తోంది. ఈవెంట్ కోసం ఫౌమ్ హౌస్ నిర్వాహకులకు రూ.30 నుంచి రూ.50 లక్షల వరకూ చెల్లించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదుచేయడంతో విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ పార్టీ వెనుకు సూత్రధారులు ఎవరనేది తెలుస్తుంది. పట్టుబడినవారి నుంచి నార్కోటిక్ పరీక్షల కోసం నమూనాలు స్వీకరించారు.
ఇక, తన పేరుతో స్టిక్కర్ ఉన్న కారు పట్టుబటడంపై ఏపీ ఎమ్మెల్యే స్పందించారు. 2023 అక్టోబరుతోనే దానికి టైమ్ అయిపోయిందని, తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన వెల్లడించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే, టాలీవుడ్‌కు చెందిన ఓ నటి కూడా తాను రేవ్ పార్టీలో ఉన్నట్టు వచ్చిన ఆరోపణలు ఖండించారు. తాను ఆ పార్టీలో లేనని ఆమె తెలిపారు. మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆమె తెగేసి చెప్పారు. అనవసరంగా తన పేరును లాగొద్దని ఆ నటి విజ్ఞప్తి చేశారు.