చిత్తూరు నగరంలో బజారు నడివీధి గంగమ్మ జాతర మంగళవారం ఉదయం ఘనంగా మొదలైంది. జాతర వేడుకలను వంశపారంపర్య ధర్మకర్త కుటుంబం, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ముసుగు తొలగించి వేడుకలు ప్రారంభించారు. జాతర వేడుకల్లో పాల్గొనేందుకు చిత్తూరు పరిసర ప్రాంతాల నుంచి కాకుండా తమిళనాడు , కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. వివిధ వేషధారణలో ముక్కులు తీర్చుకుంటున్నారు. కాగా ఉత్సవ మంటపం వద్ద సోమవారం రాత్రికి ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోవాడానికి బారికేడ్లు, చలువ పందిళ్లు, మంటపానికి విద్యుత్తు దీపాలంకరణ తదితర ఏర్పాట్లు చేశారు. ఎస్పీ మణికంఠ చందోలు ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టింది. మంగళవారం ఉదయం వంశపారంపర్య ధర్మకర్త సీకే జయచంద్రారెడ్డి దంపతులు అమ్మవారికి తొలిపూజ చేశాక భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి అంబలి సమర్పించారు. రాత్రి 10 గంటల వరకు అమ్మవారిని భక్తులు దర్శించి పూజలు చేయడానికి అనువుగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కాగా, బుధవారం సాయంత్రం అమ్మవారిని ఊరేగింపుగా కట్టమంచి రైల్వే అండర్‌బ్రిడ్జి సమీపంలోని గంగజాతర బావి వద్దకు తీసుకొచ్చి నిమజ్జన పూజలు చేసి నీటిలో అమ్మవారిని కలపడంతో గంగజాతర ముగుస్తుంది.