నైరుతి బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఈశాన్యంగా పయనించి ఈనెల 24వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడనున్నది. ఈ నెలాఖరుకల్లా ఇది తుఫానుగా మారే అవకాశాలను తోసిపుచ్చలేమని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. అయితే దీన్ని ముందే నిర్ధారించడం తొందరపాటే అవుతుందని పేర్కొంది. అందుకే తుఫానుగా మారే విషయంపై అధికారికంగా ప్రకటన చేయలేదు. ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. అల్పపీడనం మధ్య బంగాళాఖాతం నుంచి ఈనెల 25వ తేదీ నాటికి ఇది ఒడిశా తీరం దిశగా పయనిస్తుందని ఐరోపా మోడల్ చెబుతుండగా...ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని మరికొన్ని మోడళ్లు చెబుతున్నాయి. ఒకటి, రెండు మోడళ్లు ఏపీ తీరం దిశగా వస్తుందని తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీలను జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. వాయుగుండం గమనంపై బుధవారానికి మరింత స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు అంటున్నారు. అల్పపీడనం బలపడి వాయుగుండంగా బలపడే క్రమంలో రాష్ట్రంలో ఎండలు పెరిగి గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని వారు హెచ్చరిస్తున్నారు. ఎండలు పెరిగే క్రమంలో వడగాడ్పులకు అవకాశం ఉందన్నారు.