తిరుమలకు నడిచి వెళ్లే అలిపిరి మార్గంలో మరోసారి చిరుతల సంచారంతో కలకలం రేగింది. అలిపిరి మెట్లు ముగిసే దివ్యారామం వద్ద రెండు చిరుతలను చూశామంటూ కొంతమంది భక్తులు చెప్పడంతో ఫారెస్ట్, విజిలెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అలిపిరి మెట్లు ముగిసే జీఎన్సీకి సమీపంలో రెండు చిరుతలు కనిపించడంతో సమీపంలో కాలినడకన వెళ్తున్న భక్తులు పెద్దగా కేకలు వేశారు. వెంటనే సమీపంలోని విజిలెన్స్ సిబ్బందికి సమాచారమిచ్చారు. హుటాహుటిన ఫారెస్ట్, విజిలెన్స్ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే భక్తుల కేకలతో చిరుతలు అడవిలోకి వెళ్లిపోయాయి. వెంటనే ఫారెస్ట్ అధికారులు కాలినడక భక్తులను అప్రమత్తం చేసి, గుంపులుగా అనుమతిస్తున్నారు. చిన్నపిల్లలను ఒంటరిగా వదలవద్దని మైకుల ద్వారా ప్రచారం చేశారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారులు వివిధ విభాగాల అధికారులను అప్రమత్తం చేశారు. నిరంతరం కాలినడక మార్గంలో నిఘా ఉంచాలని ఆదేశించారు.