పోలింగ్ రోజు, ఆ తర్వాత రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలన్నీ ప్రాణాంతకమైనవేనని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చింది. ఇంతటి తీవ్రమైన కేసుల్లో స్థానిక పోలీసుల దర్యాప్తు లోపభూయిష్ఠంగా ఉందని ఆక్షేపించింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో నమోదైన 33 కేసుల్లో 1,370 మంది నిందితులు ఉంటే కేవలం 124 మందినే స్థానిక పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపింది. ఎఫ్‌ఐఆర్‌లలో నమోదు చేసిన సెక్షన్లకు అదనపు సెక్షన్లను చేర్చాలని స్థానిక ఎస్‌హెచ్‌వోలను ఆదేశించింది. సిట్ అధిపతి ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్, ఏసీబీ ఎస్పీ రమాదేవి సోమవారం మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు 150 పేజీల రహస్య ప్రాథమిక నివేదికను అందజేశారు. రెండ్రోజుల పాటు మూడు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యక్ష సాక్షులు, బాధితులతో మాట్లాడిన సిట్ బృందాలు హింస తీవ్రత, కుట్ర కోణాన్ని గుర్తించాయి.