ఇసుక అక్రమ తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి సోమవారం మండలంలోని మున్నంగి, బొమ్మువానిపాలెం, తాడేపల్లి మండలంలోని గుండెమెడ ఇసుక రీచలను జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, జేసీ రాజకుమారి, తెనాలి సబ్‌కలెక్టర్ ప్రఖర్‌జైన, అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్‌జగన్నాద్, జిల్లా స్ధాయి ఇసుక కమిటీ సభ్యులతో కలిసి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.... ఎన్టీటీ నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిగితే తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అనుమతులు పొందిన పరిధిలోనే మాన్యువల్‌గా ఇసుక తవ్వకాలు జరిగేలా మైనింగ్ శాఖ అధికారులతో పాటు పోలీసు, రెవెన్యూ, శాండ్ కమిటీ, ఇతర శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇసుక అక్రమ తవ్వకాలు జరిగినట్లు గుర్తించితే వెంటనే పోలీసు అధికారులు వారిపై కేసునమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టేందుకు మూడు బృందాలుగా ఏర్పడి 24గంటలు తనిఖీలు నిర్వహించాలన్నారు. కంట్రోల్‌రూమ్‌ను కూడా ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి పెద్ది రోజా, గుంటూరు రెవెన్యూ డివిజన అధికారి శ్రీకర్, ఇసుక కమిటీ కన్వీనర్ మైనింగ్ శాఖ డీడీ చంద్రశేఖర్, జిల్లా ఎస్‌ఈబీ సూపరింటెండెంట్ ఎల్. రంగారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీదేవి, భూగర్భ జలవనరుల శాఖ డైరెక్టర్ వందనం తదితరులు పాల్గొన్నారు.