వంట గ్యాస్ సిలిండర్లలో ఆయిల్ కంపెనీలు, డీలర్లు మోసాలకు తెగబడుతున్నారు. ఓవైపు వంట గ్యాస్ ధరలు పెరిగి వినియోగదారులు అదనపు భారం మోస్తుంటే, తూకంలో మోసాలకు పాల్పడుతూ కంపెనీలు, డీలర్లు ఇంకొంత భారం మోపుతున్నాయి. సోమవారం తూనికలు కొలతల శాఖ రాష్ట్రవ్యాప్తంగా చేసిన తనిఖీల్లో తక్కువ తూకంతో సిలిండర్లు నింపుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని చోట్ల ఏకంగా 2కిలోలు తగ్గించి రీఫిల్ చేస్తున్నారు. అనేక చోట్ల కిలో గ్యాస్ తగ్గించి నింపుతున్నారు. 14.2 కిలోలు ఉండాల్సిన గ్యాస్ సిలిండర్ 12 కిలోలే వస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. 5కిలోల గ్యాస్ సిలిండర్‌లోనూ అరకిలో మేర గ్యాస్ తగ్గుతున్నట్లు తనిఖీల్లో బ యటపడింది. ఈ అక్రమాలపై అధికారులు 39 కేసులు నమోదుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా తనిఖీలు చేస్తే మరిన్ని అక్రమాలు బయటపడతాయని వినియోగదారులు అంటున్నారు. బియ్యం తూకాల్లోనూ అక్రమాలు జరుగుతున్నట్లు తేలింది. కిరాణా, బియ్యం స్టోర్లపై 82 కేసులు పెట్టారు. ఎలక్ర్టికల్, హార్డ్‌వేర్ షాపులపై 103 కేసులు నమో దు చేసినట్లు పౌర సరఫరాల కమిషనర్ అరుణ్‌కుమార్ తెలిపారు. తూకాల్లో తేడాలు గుర్తిస్తే 1967 నంబరుకు కాల్ చేయాలన్నారు.