విద్యార్థులు ఏ రంగంలో ఆసక్తి కనబరుస్తున్నారో గమనించి ఆయా రంగాల్లో నిపుణులుగా వారిని విద్యా సంస్థలు తీర్చిదిద్దాలని విశ్రాంత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అన్నారు. సోమవారం నరసరావుపేట మండలంలోని కేసానుపల్లి వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన ఇంటర్నేషనల్ దిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి, పాఠశాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..... మన భాషా, సంస్కృతి పెంపొందించేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యాసంస్థలదేనన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను గుర్తించి తర్ఫీదును ఇవ్వాలన్నారు. అంతర్జాతీయస్థాయి పాఠశాలను అందుబాటులోకి తెచ్చిన డాక్టర్ నాగోతు ప్రకాశరావు కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల వ్యవస్థాపకుడు, కార్యదర్శి డాక్టర్ నాగోతు ప్రకాశరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుంచి కష్టాలతో విద్యాభ్యాసం చేసి వైద్యుడిగా ఎదిగిన తనకు చదువు విలువ తెలుసని, ఆరు నెలలుగా శ్రమించి ఈ పాఠశాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అనంతరం పాఠశాలలో జరిగిన ప్రతిభా పాఠవ పరీక్షలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు ముఖ్య అతిథి జస్టిస్ ఎనవీ రమణ బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి నేషనల్ ప్రాంచైజీ సుభాష్ కలువ అధ్యక్షత వహించారు. తొలుత ఎన్‌వీ రమణకు పాఠశాల వద్ద యాజమాన్యం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ దిల్లీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ చక్రధర్, హైకోర్టు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, స్థానిక జూనియర్ సివిల్ న్యాయాధికారి ఆశీర్వాదం పాల్, డాక్టర్ ఎనఎ్‌స రాజు, లక్ష్మణరావు, చైర్మన వేములపల్లి వెంకటనరసయ్య, ఆర్డీవో సరోజిని, రావెల సత్యనారాయణ, డాక్టర్ నలబోతు వెంకటరావు, నాగోతు శౌరయ్య, బార్ అసోసియేషన సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.