రానున్న పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తే దేశ సమైక్యతకు తీవ్ర సవాళ్లు ఎదురౌతాయని సీపీఎం జాతీయ నేత బీవీ రాఘవులు అన్నారు. దక్షిణ భారత కమ్యూ నిస్టు ఉద్యమ నిర్మాత, స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్థంతిని పురస్కరించుకుని సోమవారం రాత్రి ఎంజీ రోడ్డులోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘దేశ సమైక్యత-ఎదురౌతున్న సవాళ్లు’ అనే అంశంపై స్మారకోపన్యాసం జరిగింది. చుక్కపల్లి పిచ్చయ్య ఆడిటోరియంలో నిర్వహించిన ఈ సభకు ఎంబీవీకె ట్రస్ట్ చైర్మన్ పి.మధు అధ్యక్షత వహించారు. ముందుగా సుందరయ్య చిత్రపటానికి బీవీ రాఘవులు, పీ మధు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా రాఘవులు మాట్లాడుతూ... ‘మతం పేరుతో దేశాన్ని విభజించాలని చూడటంతో పాటు రంగు ప్రాతిపదికన కూడా దేశాన్ని విభజించాలని బీజేపీ కుయుక్తులు పన్నింది. వీటి పట్ల దేశప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ అధికారంలోకి వచ్చినా, రాకున్నా జాతీయ సమైక్యతను కాపాడుకోవడానికి ప్రజాస్వామ్య వాదులంతా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబీవీకె కార్యదర్శి పీ మురళీకృష్ణ, బాధ్యలు కే స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.