ఓట్ల లెక్కింపు సమయంలో రిటర్నింగ్ అధికారి ఏ నిర్ణయం తీసుకుంటారో అదే తుదినిర్ణయమని పల్నాడు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీకేశ్ బాలాజీ లత్కర్ అన్నారు. కలెక్టరేట్‌లో 4న జరిగే ఓట్ల లెక్కింపుకు ముందస్తు ఏర్పాట్లపై ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో అయన సోమవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ... ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఆయా నియోజకవర్గాలలో శాంతి భద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఓట్ల లెక్కింపులో ఆయా నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కీలక పాత్ర పోషించాలన్నారు. ఎన్నికల కమిషన్ కౌంటింగ్‌కు సంబంధించిన పలు విషయాలను పుస్తకం రూపంలో ముద్రించడం జరిగిందని దీనిని ప్రతి ఒక్క రిటర్నింగ్ అధికారి చదివి పరిజ్ఞానం పొందాలన్నారు. ఫలితాలు ప్రకటించిన అనంతరం సంబంధిత ఈవీఎంలు, వీవీ ప్యాట్ సక్రమంగా పటిష్టమైన బందోబస్తు ద్వారా స్ర్టాంగ్ రూమ్‌లకు చేర్చాలన్నారు. అందుకు అవసరమైన సిబ్బందిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని, నిర్లక్ష్యం వహించరాదని ఆదేశించారు. అబ్జర్వర్, పోటీలో ఉన్న వివిధ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో స్ర్టాంగ్ రూమ్ తెరవాలని ఇందుకు అవసరమైన చురుకైన కౌంటింగ్ సిబ్బందిని నియమించుకోవాలి, పార్లమెంటుకు సంబంధించిన కౌంటింగ్ సిబ్బంది, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ సిబ్బంది వేర్వేరుగా నియమించాలన్నారు. కౌంటింగ్ సిబ్బందికి కూడా ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాలు ఆయా నియోజకవర్గాల స్థాయిలో నిర్వహించాలన్నారు. కౌంటింగ్‌లో పాల్గొనే ప్రతి ఒక్క సిబ్బందికి కచ్చితంగా గుర్తింపు కార్డు ఉండాలని, వివిధ రాజకీయ పార్టీల పార్టీ ఏజెంట్లు కూడా కచ్చితంగా గుర్తింపు కార్డు ధరించి ఉండాలన్నారు. డేటా ఎంట్రీలో చురుకైన సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎ.శ్యాం ప్రసాద్ పెదకూరపాడు రిటర్నింగ్ అధికారి శ్రీరాములు, సత్తెనపల్లి రిటర్నింగ్ అధికారి మురళీకృష్ణ, చిలకలూరిపేట రిటర్నింగ్ అధికారి నారదముని, వినుకొండ రిటర్నింగ్ అధికారి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.