గత 2 రోజులుగా కర్ణాటకతోపాటు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన బెంగళూరు రేవ్ పార్టీ.. ఆంధ్రప్రదేశ్‌లో మరింత రాజకీయ రంగు పులుముకుంది. ముఖ్యంగా నెల్లూరు రాజకీయాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. బెంగళూరు రేవ్ పార్టీ విషయంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణం అవుతున్నాయి. దీనిపై స్పందించిన మంత్రి కాకాణి.. తిరిగి చంద్రమోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ఈ వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతోంది.
అయితే దీనంతటికీ కారణం.. బెంగళూరు రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ వద్ద దొరికిన కారుపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే పాస్ ఉండటమే. అయితే ఆ ఎమ్మెల్యే పాస్‌కు తనకు ఏ సంబంధం లేదని ఇప్పటికే మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ ఘటనపై స్పందించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రం.. మంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కాకాణి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బెంగళూరు రేవ్ పార్టీలో తనకు సంబంధించిన వాళ్లు ఎవరూ లేరని.. స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని మంత్రి తేల్చి చెప్పారు.
బెంగళూరు రేవ్ పార్టీ ఘటనపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన మీద తప్పడు ప్రచారం చేస్తున్నారని.. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎవరో అనామకుడు తన పేరుతో ఉన్న ఎమ్మెల్యే జిరాక్స్ కాపీ స్టిక్కర్‌ను వాడారని.. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అసలు ఆ రేవ్ పార్టీని తానే ఆర్గనైజ్ చేశానని సోమిరెడ్డి ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఎమ్మెల్యే పాస్ నెల్లూరులోని తన ఇంట్లోనే ఉందని.. ఎవరు అయినా వెళ్లి చూసుకోవచ్చని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. ఇద్దరం బ్లడ్ శాంపిల్స్ ఇద్దామని.. ఎవరికి రేవ్ పార్టీకి వెళ్లే అలవాటు ఉందో తెలుస్తుందంటూ పేర్కొన్నారు. బెంగుళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై తాను సీబీఐ విచారణకు కూడా సిద్ధమేనని కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే బెంగళూరు రేవ్ పార్టీలో చంద్రబాబు కుటుంబసభ్యులు ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. తనకు ఈ కేసు గురించి బెంగుళూరు పోలీసుల నుంచి ఎలాంటి ఫోన్లు రాలేదని పేర్కొన్నారు. ఆ ఫామ్ హౌస్ యజమాని ఎవరో కూడా తనకు తెలియదని.. ఇందులో కుట్రకోణం ఏమైనా ఉందా విచారణ చేయాలని ఏపీ డీజీపీని కోరినట్లు కాకాణి తెలిపారు.