బెంగళూరులో పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీ ప్రస్తుతం కర్ణాటకతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ బెంగళూరు రేవ్ పార్టీలో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు వార్తలు రావడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షేక్ అయిపోయింది. ఆ రేవ్ పార్టీలో ఉన్న వారి పేర్లు బయటికి వస్తుండటంతో కొందరు తాము అసలు ఆ రేవ్ పార్టీలో లేమని ఫోటోలు, వీడియోలు వదులుతున్నారు. అయితే ఈ రేవ్ పార్టీ చాలా కాస్ట్లీ పార్టీ అని తెలుస్తోంది. ఈ రేవ్ పార్టీకి ఒక్క రోజుకు ఎంట్రీ ఫీజు అక్షరాలా రూ.50 లక్షలు అని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.
ఈ రేవ్ పార్టీకి 100 మంది హాజరు కాగా.. అందులో ఇప్పటివరకు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ బి. దయానంద వెల్లడించారు. ఇక సోమవారం తెల్లవారుజామున బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్న ఫామ్ హౌస్‌లో జరుగుతున్న ఈ రేవ్ పార్టీపై బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడి చేశారు. ఆ రేవ్ పార్టీలో భారీగా మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. 17 ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, కొకైన్, ఇతర డ్రగ్స్.. ఆ ఫామ్ హౌస్‌లో దొరికినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక నుంచి వంద మంది ఆ రేవ్ పార్టీలో పాల్గొన్నారని.. అందులో 25 మంది యువతులు, డీజేలు, మోడల్స్, యాక్టర్స్, టెక్ ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు సన్‌సెట్ టు సన్‌రైజ్ పేరుతో ఈవెంట్‌ను నిర్వహించారు. ఇక హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి బర్త్ డే సందర్భంగా ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే పేరుతో ఉన్న స్టిక్కర్ కలిగిన కారు కూడా ఆ ఫామ్ హౌస్ వద్ద గుర్తించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా మరో 15 లగ్జరీ కార్లను కూడా ఫామ్ హౌజ్ వద్ద పార్కింగ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ రేవ్ పార్టీపై ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఇక ఆ రేవ్ పార్టీకి హాజరైన వారి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాటిని టెస్ట్‌ల కోసం ల్యాబ్‌కు పంపించినట్లు పేర్కొన్నారు. ఆ బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్స్ కోసం వేచి చూస్తున్నామని.. వాటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత దర్యాప్తును మరింత ముమ్మరం చేయనున్నట్లు బెంగళూరు సీపీ బి.దయానంద స్పష్టం చేశారు. అయితే ఈ రేవ్ పార్టీలో ఎలాంటి ప్రజా ప్రతినిధులు లేరని.. కానీ టాలీవుడ్‌కు చెందిన హేమ ఉందని సీపీ వెల్లడించారు.