సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ)ను రెండోసారి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు ఆయనను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశిస్తూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) ఈ నెల 8న ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రైబ్యునల్ ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా ఉన్నాయని వ్యాజ్యంలో పేర్కొన్నారు. సస్పెన్షన్‌కు తగిన కారణాలు ఉన్నాయని, వీటిని గుర్తించడంలో ట్రైబ్యునల్ విఫలమైందని పేర్కొన్నారు. వెంకటేశ్వరరావుపై నమోదు చేసిన కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేశామని తెలిపారు. ఈ దశలో ఆయనను తిరిగి సర్వీసులోకి తీసుకుంటే ట్రయల్ కోర్టులో విచారణపై ప్రభావం పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ట్రైబ్యునల్ ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్ధించారు. సీఎస్ తరఫున సాధారణ పరిపాలనశాఖ డిప్యూటీ సెక్రెటరీ జయరామ్ అఫిడవిట్ వేశారు. ఈ వాజ్యాన్ని వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం ఈ నెల 23న విచారించనుంది.