ఏసీబీ వలకు పెద్ద అవినీతి తిమింగలం చిక్కింది! ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో.. హైదరాబాద్ కమిషనరేట్ సీసీఎ్‌సలో ఏసీపీ (టీమ్-3)గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. అశోక్‌నగర్‌లోని ఆయన ఇంటితో పాటు.. ఆయన సంబంధీకుల ఇల్లు సహా.. తెలంగాణలో 11 చోట్ల, ఆంధ్రాలో మూడు చోట్ల (విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలోని పులగాలిపాలెం, అనకాపల్లి జిల్లా రోలుగుంట, చోడవరం).. కలిపి మొత్తం 14 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం ఉమామహేశ్వరరావు సాహితీ ఇన్‌ఫ్రా ప్రీ లాంచ్ పేరుతో జరిగిన రూ.1500 కోట్ల మోసం కేసులో కీలక విచారణాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై విపరీతమైన అవినీతి ఆరోపణలు రావడం, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం అందడంతో ఏసీబీ అధికారులు దాడులు చేసినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సురేంద్ర తెలిపారు. ఇప్పటిదాకా నిర్వహించిన సోదాల్లో రూ.37.5 లక్షల నగదు.. 60 తులాల బంగారం, 17 విలువైన ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు ఘట్‌కేసర్‌లో 5 చోట్ల, శామీర్ పేట, కూకట్‌పల్లి, మల్కాజిగిరిలో ఒక్కొక్కచోట, వైజాగ్, చోడవరంలో ఏడు చోట్ల, అశోక్‌నగర్‌లో ఏడుచోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. శామీర్‌పేటలో ఒక విల్లా కొనుగోలు చేసినట్టు తెలిసిందని ఏసీబీ జేడీ వెల్లడించారు. ఇప్పటివరకూ స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ.3.46 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ.25 కోట్లకు పైగానే ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా.. అధికారులు స్వాధీనం చేసుకున్న ఒక డైరీలో సందీప్ అనే పేరు రాసి ఉన్నట్టు సమాచారం. అది పోలీస్ అధికారి పేరేనా అని విలేకరులు ప్రశ్నించగా.. దానిపై పూర్తి స్పష్టత లేదని, ఉమామహేశ్వరరావు సైతం దానిపై ఎలాంటి సమాధానం చెప్పలేదని ఏసీబీ జేడీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సోదాల అనంతరం ఉమామహేశ్వరరావును అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.